గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్-3 పెండింగ్ పనులను వేగంగా చేపట్టి అందుబాటులోకి తీసుకోస్తామని కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్-3 పనులను స్వర్ణ భారతీ నగర్ ప్రాంతంలో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్, ఎమ్మెల్యే బి. రామాంజనేయులు, ఏపి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ లతో కలిసి కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ పేరేచర్ల నుంచి పలనాడు వైపునకు వెళ్లడానికి ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రధాన రహదారిగా ఉపయోగపడుతుందన్నారు. 10 – 14 ఏళ్ల క్రితం పల్నాడు నుంచి వచ్చే ట్రాఫిక్ గుంటూరు సిటీ బయట నుంచి వెళ్లే విధంగా ప్లాన్ చేసి డిజైన్ చేసిన రహదారి ఇదని పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ ప్రభావిత భవనాలకు స్ట్రక్చరల్ నష్ట పరిహారం చెల్లించాల్సినవి ఇంకా ఉండగా త్వరలోనే పూర్తి నిర్మాణానికి రహదారి సిద్ధం అవుతుందన్నారు. స్థలం కోల్పోయిన ప్రతీ ఒక్కరికి నెలకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ఇప్పటికే అందించబడిందని, త్వరలోనే టెండర్లను పిలిచి నిర్మాణాలు ప్రారంభింపజేసేలా ప్రయత్నం చేస్తామన్నారు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కొత్తగా రాబోయే ఔటర్ రింగ్ రోడ్డుకు కూడా అనుసంధానంగా ఉంటుందన్నారు.
మేయర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను ప్రజా అవసరాల మేరకు టైం లైన్ పెట్టుకొని వేగంగా చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ వలన గుంటూరు నగరానికి ట్రాఫిక్ సమస్య తగ్గడమే కాకుండా పల్నాడు ప్రాంతం నుండి విజయవాడ వైపు వెళ్ళే వారికి దూరం కూడా తగ్గుతుందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ పనులను వేగంగా చేపట్టడానికి జిఎంసి వైపు నుండి ప్రత్యేక ద్రుష్టి సారిస్తామని తెలిపారు.
కమిషనర్ మాట్లాడుతూ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్-3 పూర్తికి పెండింగ్ లో ఉన్న ప్రాంతంలో ఖాళీ స్తలాలతో కలిపి 385 ఆస్తులు ప్రభావితం అవుతాయని, వాటిలో 340 బి.ఫారాలు, ఆక్రమణలు ఉన్నాయన్నారు. ఇప్పటికే మానవతా దృక్పథంతో బి.ఫారాలు, ఆక్రమణదారులకు నిర్మాణ నష్ట పరిహారాన్ని తొలివిడతగా 128 మందికి ఇచ్చామని, త్వరలో మిగిలిన వారికి కూడా ఇంజినీరింగ్ అధికారులు నష్ట పరిహార అంచనాలు పూర్తీ చేశాక ఇస్తామని తెలిపారు.
ఎంఎల్ఏ మాట్లాడుతూ 12 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ లో కేవలం 910 మీటర్లను విస్తరణ చేయకపోవడం వలన మిగిలిన రోడ్ ఏర్పాటు చేసినప్పటికీ ఉపయోగంలో లేకుండా ఉందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ పూర్తీ అయితే పేరేచర్ల నుండి నగరంలోకి రాకుండా నేరుగా కాకాని రోడ్ జాతీయ రహదారికి వెళ్ళడానికి వీలవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇన్నర్ రింగ్ రోడ్ పనులను పూర్తి చేయడానికి పూనుకున్నామన్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు బి.స్మిత పద్మజ, వై.సాంబిరెడ్డి, సిటి ప్లానర్ రాంబాబు, ఏసిపి రెహ్మాన్, సిఆర్డిఏ ఎస్ఈ భాస్కర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News