Breaking News

కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్ధల్లో పరీక్షా ఫలితాలు

-మన పిల్లలు మట్టిలో మాణిక్యాలు
-నీట్ లో ఉచిత కోచింగ్ సెంటర్లను ఈ ఏడాది నుంచి 10 కి పెంచుతాం
-విద్యార్థుల ఉత్తమ ప్రతిభకు గుర్తింపే నగదు పురస్కారాలు
-విజయాలు తమవే అని నిరూపించిన గిరిజన విద్యార్థులు
– మంత్రులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గుమ్మిడి సంధ్యారాణి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్ధుల ప్రతిభకు పట్టం కట్టి వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం ఏర్పాటు చేసిన పదవ తరగతి, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాలు, వసతి గృహాల విద్యార్ధులకు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గిరిజన సంక్షేమం మరియు స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ పదవ తరగతి, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులకు ప్రశంసా పత్రాలు నగదు ప్రోత్సాహకాలు అందించటం ఇదే తొలిసారన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫలితాలు రావలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం అన్నారు. పేద విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రి, మరియు మానవవనరుల శాఖా మంత్రి నారా లోకేశ్ లు పత్యేక శ్రద్ధ తీసుకుని విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులు, తదిర మౌలిక ఏర్పాట్లు కొరకు రూ. 143 కోట్లు ఖర్చుచేసామన్నారు. నీట్ లో ఉచిత కోచింగ్ సెంటర్లను ఈ ఏడాది నుంచి 10 కి పెంచుతున్నామన్నారు. తద్వారా ఎక్కువ మంది ఐఐటీ, నీట్ తదితర విద్యా సంస్థల్లో ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉందన్నారు.

ప్రతిభ ఎవరి సొంతం కాదని, సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాలు, వసతి గృహాల విద్యార్ధుల వల్ల ఆయా సంస్థలకు మంచి పేరు వచ్చిందన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. సీనియర్ ఇంటర్ లో 94 శాతం మార్కులు రావడం విద్యార్ధుల, అధ్యాపకులు కృషికి నిదర్శనమన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు రెండు నెలలకు ఒకసారి కాస్మోటిక్ కిట్స్, నాణ్యమైన బియ్యంతో భోజనం అందిస్తామన్నారు. గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక వైద్యుల్ని నియమిస్తామన్నారు. సంరక్షకులు లేని విద్యార్థులకు వేసవి సెలవుల్లోనూ హాస్టళ్లలో వసతి కల్పిస్తున్నామన్నారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపట్ల టీచర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వచ్చే ఏడాది గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా అధ్యాపకులు కృషి చేయాలన్నారు. విద్య ఆవశ్యకతను గుర్తించి మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు గురుకుల విద్యా వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్ధులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత మనందరిపైన ఉందన్నారు. ఈ అవకాశాలను ఉపయోగించుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని మంత్రి తెలిపారు.

గిరిజన సంక్షేమం మరియు మహిళా & శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు వర్ధంతి రోజున గిరిజన విద్యార్ధులకు అవార్డులు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 315 మంది పదవ తరగతి, ఇంటర్మీడియెట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులకు మెమొంటో, సర్టిఫికెట్స్ అందించటం జరిగిందన్నారు. ఇందులో 34 మంది మెరిట్ విద్యార్ధులకు నగదు పురస్కారాలను అందించామన్నారు. ప్రతిభకు పట్టం కట్టే విధంగా మెరిట్ విద్యార్ధులకు నగర పురస్కారం అందించడం జరిగిందన్నారు. మొదటి ప్రైజ్ 20,000 ల నగదు బహుమతి, రెండో ప్రైజ్ రూ. 15,000 ల నగదు బహుమతి, మూడో ప్రైజ్ రూ. 10,000 ల నగదు బహుమతి అందించడం జరిగిందన్నారు. అదే విధంగా ఉత్త‌మ సేవ‌లు అందించిన సాంఘిక సంక్షేమ శాఖ‌, గిరిజ‌న సంక్షేమ శాఖ‌ల‌కు చెందిన 36 మంది ఉద్యోగులు, టీచ‌ర్స్ ను మంత్రులు స‌త్క‌రించ‌డం జ‌రిగింది. గిరిజన విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా తన ప్రతిభను చాటుతూ, అత్యుత్తమ ఫలితాలను సాధించడం ఎంతో గర్వకారణమన్నారు. విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం అందిస్తున్న మౌలిక వసతులు, ఆర్థిక సహాయంతో గిరిజన విద్యార్థులు నూతన శిఖరాలను అధిరోహిస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గురుకుల పాఠశాలల స్థాపనకు శ్రీకారం చుట్టారన్నారు. ఆయనే తొలిసారిగా గురుకుల పాఠశాలల అభివృద్ధికి పునాది వేశారన్నారు.

గిరిజన పిల్లల భవిష్యత్తును వెలుగులోకి తేవాలన్న సంకల్పంతో ఆయా విద్యా సంస్థలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గిరిజన విద్యాభివృద్ధికి మరింత ఊతం ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ఆధునిక భవనాల నిర్మాణం, డిజిటల్ విద్యా సదుపాయాల కల్పన వంటి కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 551 ఆశ్రమ పాఠశాలలు, 1958 గిరిజన ప్రాథమిక పాఠశాలలు, 199 రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2,36,410 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. విద్యార్థులకు కాస్మెటిక్స్, బెడ్డింగ్ మెటీరియల్, ప్లేట్, గ్లాస్, స్టేషనరీ లాంటి అన్ని వస్తువులు ప్రభుత్వమే అందజేస్తుందన్నారు. 1,25,976 మంది విద్యార్థులు పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ పొందుతుండగా, ఈ సంవత్సరానికి ట్యూషన్ ఫీజు రీయింబర్స్ మెంట్ కింద రూ. 81.29 కోట్లు, మెయింట్ నెన్స్ ఫీజు కింద రూ. 7.75 కోట్లు విద్యార్ధుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల్లో ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల్లో 6,722 మంది, గురుకులాల్లో 3,766 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో 44, గురుకులాల్లో 12 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయన్నారు. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షకు 4,317 మంది హాజరైతే 3,958 మంది ఉత్తీర్ణత సాధించారని, గురుకులాల్లో ఉత్తీర్ణత శాతం 91% కాగా ఇది రాష్ట్ర సగటు 83% కంటే అధికమన్నారు. ఐఐటీ, నీట్ వంటి అత్యున్నత స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం 93 మంది విద్యార్థుల్లో 81 మంది ఐఐటీ అడ్వాన్స్ కు అర్హత సాధించగా, 25 మంది ఐఐటీ, 50 మంది నీట్ లలో ప్రవేశం పొందే అవకాశాలున్నాయన్నారు. ఇది మన గిరిజన విద్యార్థుల ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు.

సాంఘిక సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ ల ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ మాట్లాడుతూ ప్రతిభ గల విద్యార్ధులను సన్మానించటం చాలా సంతోషంగా ఉంటుందన్నారు. విద్యార్ధులకు ఈ వయస్సులో వచ్చిన అవార్డులు జీవితాంతం గుర్తుంటాయన్నారు. విద్యతో పాటు విద్యార్ధులు వినయం, తమ కెరియర్ ను కొనసాగించాలన్నారు. విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి వెళ్లేలా ఈ పురస్కారం అనునిత్యం గుర్తు చేస్తాయన్నారు. గిరిజన సమాజాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సాధనం విద్యే అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయ, మౌలిక వసతులతో ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని సాధించగలడని మేము నమ్ముతున్నామన్నారు. ఈ విజయాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని ఎంఎం నాయక్ తెలిపారు.

కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి వి. ప్రసన్న వెంకటేష్, సంచాలకులు లావణ్య వేణి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి జి. గౌతమి, సంచాలకులు ఎస్. భార్గవి, విద్యార్ధుల తల్లిదండ్రలు, అధ్యాపకులు, వార్డెన్లు, తదితరలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *