-రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం సోమశిల లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ప్రపంచంలో అగ్రదేశాల సరసన నిలుస్తున్న భారతదేశాన్ని దెబ్బతీయాలని పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపి కాశ్మీర్ లోని పహాల్గంలో ఉగ్రదాడికి పాల్పడిందన్నారు. ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరంగా మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకునే సమయం ఆసన్నమైందన్నారు. భారతీయులంతా దేశ భద్రత కోసం సంఘటితం కావాలన్నారు. మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్ భూభాగంపై ఉన్న ఉగ్రవాదులను ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం అంతమొందించడం భారతదేశాన్ని సగౌరవంగా తలెత్తుకునేలా చేసిందన్నారు. ఉగ్రవాదం అంతమయ్యేంతవరకు ఇది కొనసాగుతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మన దేశమని, ఆర్థికంగా అన్ని రంగాల్లో బలపడుతున్న భారత్ ను ధైర్యంగా ఎదుర్కోలేక ఉగ్ర దాడులను పాకిస్తాన్ ప్రోత్సహిస్తుందని ఆనం అన్నారు. దేశ ప్రజలందరూ దేశ రక్షణ కోసం ఏకతాటిపై నిలబడి పాకిస్తాన్ దాడులను, కుట్రను తిప్పి కొట్టేందుకు సంఘటితం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. దేశ భద్రత, రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రజలంతా అండగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News