-ఎంఎస్ఎంఈలు గేమ్ చేంజర్ కాబోతున్నాయి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎంఎస్ఎంఈ పార్కులలో భూమి కేటాయింపులను కేవలం 30 రోజులలో పూర్తి చేయాలని రాష్ట సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. పార్క్ లలో మౌలిక సదుపాయాలను మరింత వేగంగా కల్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి. రాష్ట్రంలోని ప్రతిపాదిత 175 సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ఎంఎస్ఎంఈ పార్కులలో జరుగుతున్న మౌలిక సదుపాయాల కల్పనతో పాటుగా భూ కేటాయింపు, తదితర అంశాలపై ఏపీఐఐసి వైస్ చైర్మన్, ఐఏఎస్ అభిషిక్త్ కిషోర్, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇటీవల ప్రారంభించిన 11 ఎంఎస్ఎంఈపార్కులలో, భూమి కేటాయింపులను త్వరితగతిన పూర్తి చేయాలని, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సహకారాలను అందించాలని ఆదేశించారు. పార్క్ ల పని తీరు, జరుగుతున్న కార్యక్రమాలు, నిర్ణయాల అమలుపై కనీసం రెండు వారాలకు ఒకసారి సమావేశం నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేసారు. ఎంఎస్ఎంఈ పార్కులలో భూమి కేటాయింపుకు సంబంధించిన పురోగతిని ప్రతి 15 రోజులకు ఏపీఐఐసి అధికారులు అందించాలని ఆదేశించారు. ఎంఎస్ఎంఈలకు కేంద్ర ప్రభుత్వ ఎంఎస్ఈ-సిడీపీ పథకం కింద ఆర్థిక సహాయం పొందే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. దీని ద్వారా పార్క్ లలో మరింత తక్కువగా పరిశ్రమల ఏర్పాటుకు భూ కేటాయింపులు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. పార్క్ లలో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని, తద్వారా పార్క్ ల అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక పీ4 మోడల్‌ను అన్వేషించాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఓ షెడ్యూల్ సిద్దం చేయాలని, క్యాలెండర్ ప్రకారం వాటిని పూర్తి చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఎంఎస్ఎంఈ పార్క్ లు గేమ్ చేంజర్ కాబోతున్నాయని, యువ పారిశ్రామిక వేత్తలను తయారు చేయడానికి ఇది అద్భుతమైన వేదిక అని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ప్రారంభం కాబోయే ఈ పార్క్ లు దేశ పారిశ్రామిక రంగానికి దిక్సూచి అవుతాయని ఆకాంక్షించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఎంఎస్ఎంఈ పార్క్ లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, అధికారులు ముఖ్యమంత్రి విజన్ కు తగ్గట్టుగా పని చేయాలన్నారు.
Prajavartha Online Telugu News