వీర సైనికుడు మురళి నాయక్ వీర మరణం పట్ల ర్యాలీ సందర్భంగా నివాళులు అర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు నగర ప్రజలు

-వర్షం కురుస్తున్నా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని తమ సంఘీభావం తెలియ చేసిన యువత, నగర ప్రజలు, మహిళలు
-భారీ జాతీయ జెండాతో ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా ప్రదర్శన
-ర్యాలీ మొత్తం జాతీయ స్ఫూర్తితో మారుమ్రోగిన నినాదాలు ఉత్సాహంగా సాగిన తిరంగ యాత్ర
-పుష్కర్ ఘాట్ నుంచి ప్రారంభమై.. కోటగుమ్మం సెంటర్, మెయిన్ రోడ్డు  మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు సాగిన ర్యాలీ
-దేశానికి ఇబ్బంది వస్తే 140 కోట్ల భారతీయులం ఏకమవుతాం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ  మంత్రి శ్రీ కందుల దుర్గేశ్ , ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ  సోము వీర్రాజు ,  జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు , రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే  ఆదిరెడ్డి శ్రీనివాస్ , అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి , రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ , కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వేంకటేశ్వరరావు , గోపాలపురం ఎమ్మెల్యే  మద్దిపాటి వెంకటరాజు , రుడా  ఛైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి , జిల్లా అధికారులు, కూటమి , వివిధ సంఘాల నాయకులు, నగర ప్రజలు

ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పహల్గాం ఉగ్రమూకల దాడిలో అసువులు బాసిన భారత పౌరులకు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన సైనికులు మురళీ నాయక్ ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. మనందరం గౌరవంగా భావించే స్త్రీల నుదటన ఉగ్రవాదులు సింధూరాన్ని చెరిపివేస్తే ఆ దుష్ట ముష్కరులపై ఏ రకమైన ప్రతీకారం తీర్చుకుంటామో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసి చూపించారన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ధీరత్వాన్ని మంత్రి దుర్గేష్ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆపరేషన్ సింధూర్‌తో ఉగ్రస్థావరాలపై దాడి జరిపి భారతదేశ ప్రతిష్టను నెలబెట్టారని తెలిపారు. శాంతి కాముక దేశమైన భారత్ లో భారతీయులు కోరుకునేది శాంతి అన్నారు.కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న సువిశాల భారతదేశంలో భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న మతాలు, భిన్న కులాలు ఉన్నప్పటికీ మనమంతా భారతీయులమేనని మంత్రి దుర్గేష్ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం సాధించిన ఏకైక దేశం భారత దేశమన్నారు.తీవ్రవాదులు భారత్ పై దండెత్తితే ఆపరేషన్ సింధూర్ ద్వారా సమాధానం చెప్పిన ప్రధాన మోదీకి, ఆయనకు సహకరించిన జవాన్ లకు సెల్యూట్ అని చెప్పారు. నేడు మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం సరిహద్దుల్లో ఉండి పోరాడుతున్న సైనికుల ఆత్మస్థైర్యానికి, ధైర్యానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులు తామంతా వెన్నంటే ఉంటామని స్పష్టం చేశారు. ఏపీకి చెందిన పింగళి వెంకయ్య రూపొందించిన మువ్వన్నెల జెండా నీడలో ముందుకు వెళ్తూ భారతమాత ఆశీస్సులతో సైనికులతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జాతీయ జెండాను చూడగానే ప్రతి ఒక్కరిలో దేశభక్తి, ఉద్వేగం ఉప్పొంగుతాయని అందుకే మువ్వన్నెల జెండాను పట్టుకొని తిరంగా ర్యాలీ ద్వారా తామంతా భారతీయులమనే నినాదాన్ని ప్రతిధ్వనించేలా నినదించాలని పిలుపునిచ్చారు.

రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ 2014కి ముందు భారత దేశం మీద, పౌరుల మీద పొరుగుదేశం నుండి వచ్చిన ఉగ్రవాదులు ప్రత్యేకించి ముంబయి, హైదరాబాద్ లోని గోకుల్ చాట్, ఢిల్లీలోని జామా మసీదు మీద పరిపరి విధాల దాడులు చేశారన్నారు. 2014 అనంతరం భారత సైనికుల మీద దాడులు చేసినట్లయితే ఊరుకునే పరిస్థితి లేదని సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్, త్రివిధ దళాల రూపంలో పొరుగుదేశానికి ప్రధాని మోదీ గట్టి సంకేతాన్ని, సందేశాన్నిచ్చారని తెలిపారు. పెహల్గాంలో అమాయకులైన పౌరులని భార్యా పిల్లల ముందే ఉగ్రవాదులు హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపడుచుల నుదటన ఉన్న సింధూరాన్ని ఉగ్రవాదులు చెరిపివేయడంతో ఆపరేషన్ సింధూర్ తో ప్రధాని నరేంద్ర మోదీ గట్టి సమాధానం చెప్పారని పురందేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా తిరంగా ర్యాలీకి తమ సంఘీభావం తెలిపేందుకు వచ్చిన రాజమహేంద్రవరం పుర ప్రజలకు పేరుపేరున కృతజ్ఞతలు చెప్పారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు మాట్లాడుతూ, సైనికుల వెంట తెలుగు ప్రజలంతా ఉన్నారు… దేశానికి కష్టం వస్తే ప్రజలంతా ఐక్యంగా ఉంటామన్నారు. పహల్గాం దాడికి ఆపరేషన్‌ సిందూర్‌తో గట్టిగా జవాబిచ్చామని, దేశ సార్వభౌమత్వానికి ఇబ్బంది వస్తే 140 కోట్లమంది ఏకం అవుతామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని పుష్కరాల రేవు దగ్గర నుంచి కోటిపల్లి బస్టాండ్‌ వరకూ నిర్వహించిన తిరంగ యాత్రలో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్‌, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులతో కలిసి పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ యాత్ర ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. సైనికులకు సంఫీుభావంగా ఈ యాత్ర చేపట్టడం జరిగిందని, వేలమంది స్వచ్ఛందంగా తరలి వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదుల ఆటలు భారత్‌లో సాగబోవన్నారు. దేశ విభజన జరిగినప్పటి నుంచి మనపై అనేక దాడులు జరిగాయని, భారత్‌ అభివృద్ధి తట్టుకోలేక శత్రుదేశం అనేక దాడులు చేసిందని, భారత్‌ అభివృద్ధిని చూసి పాకిస్థాన్‌ అసూయతో రగిలిపోతోందన్నారు. భారత్‌ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకే పాక్‌ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని, ఈ యాత్ర ద్వారా దేశం కోసం ఒక్కటవుతాం అని ప్రజలంతా స్పష్టం చేశారన్నారు. దేశభక్తి అంటే ఏమిటో వీర జవాన్‌ మురళీ నాయక్‌ చేసి చూపించారన్నారు. పహల్గామ్‌ ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్యగా ‘‘ఆపరేషన్‌ సింధూర్‌’’ ద్వారా ప్రపంచానికి మన సైనిక శక్తిని తెలియచేసి… ఇది మన సైనికుల వీరత్వానికి, మన దేశ సార్వభౌమాధికారానికి నిదర్శనమని చాటి చెప్పడం జరిగిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ దేశ ప్రజలందరికీ గర్వకాణమైన విజయం దేశ భద్రతను కాపాడేందుకు త్రివిధ దళాల సంకల్పాన్ని ఈ ఆపరేషన్‌ పునరుద్ఘాటించిందన్నారు. ఈ అఖండ విజయానికి దేశం మొత్తం సెల్యూట్‌ చేస్తున్నందున మనమంతా సాయుధ దళాలకు సమిష్టిగా కృతజ్ఞతాభి నందనలు తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు. మన సైనికులకు, దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమర్ధన తెలియజేస్తూ.. తిరంగా యాత్ర నిర్వహించి భారత్‌ సైన్యంతో మేము ఉన్నామనే సంకేతం ఇచ్చేందుకే ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ తిరంగ యాత్రలో అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వేలాది పుర ప్రజలు, ఎన్‌సీసీ క్యాడెట్లు, మాజీ సైనికులు తదితరులు పాల్గొని జాతీయ పతాకాలు చేతపట్టుకుని ముందుకు సాగారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *