-నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్
-ఎండ తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య సంరక్షణ గురించి వివరించిన మంత్రి దుర్గేష్
-అధిక ఉష్ణోగ్రతలు నివారించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు
-బీట్ ది హీట్ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు బీట్ ది హీట్ కార్యక్రమం ద్వారా ఉష్ణతాపం నుండి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. శనివారం నిడదవోలు పట్టణంలోని బాలాజీనగర్ లో ఎండ నుండి తట్టుకోండి (బీట్ ది హీట్) అనే థీమ్ తో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం వృద్ధులు, చిన్నారులు, బహిరంగ పనిదారుల రక్షణ మన కర్తవ్యం అనే నినాదంతో నిడదవోలులోని “చర్ల సుశీల వృద్ధాశ్రమంలోని” వృద్ధులకు మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పండ్లు పంపిణీ చేశారు. మెడికల్ క్యాంపును సందర్శించారు. అనంతరం వేసవి తీవ్రతను తట్టుకునే విధంగా వారి శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్(ORS) ప్యాకెట్లు అందించారు. ప్రజలు ఉష్టతాపం నుండి ఉపశమనం పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తమ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటడమే గాక వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసి వేసవి వడగాల్పుల వల్ల కలిగే అనర్థాలకు సంబంధించిన నినాదాలు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు వడ దెబ్బన బారిన పడకుండా ఉండేలా చైతన్యం కలిగించారు. కార్యక్రమంలో ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఎండలు తీవ్రమవుతున్నాయన్నారు. మానవ తప్పిదాల కారణంగానే సూర్యుడికి, భూమికి మధ్య రక్షణగా నిలుస్తున్న ఓజోన్ పొరకు చిల్లులు పడటంతో నేరుగా సూర్యరశ్మి భూమి మీద పడటం, ఏసీలు, ఫర్ ఫ్యూమ్స్ వాడటం, అడవుల నరికివేత తదితర కారణాలతో క్రమంగా ఎండలు పెరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలో ఏసీల వాడకాన్ని నియంత్రించాలని సూచించారు. వేడి నుండి రక్షించుకోవడం, వేడిని తట్టుకోవడం కోవడం చల్లని ప్రదేశంలో ఉండటం, పుష్కలంగా నీరు త్రాగడం, వేడి నుండి రక్షణ కోసం తేలికపాటి లేదా కాటన్ దుస్తులను ధరించడం చేయాలన్నారు. బయటకు అత్యవసరమైతేనే వెళ్లాలని, వెళ్లేముందుకు టోపీ లేదా గొడుగులను వినియోగించాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మనుషులతో పాటు పశు పక్ష్యాదులకు నీరు అవసరమని గుర్తించి నీటి తొట్టెలు ఏర్పాటు చేయడం, ఇంటి పైకప్పున మట్టి పాత్రలో నీళ్లు ఉంచాలన్నారు. చిన్నారులను ఇంట్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వచ్ఛంధ సంస్థలు ఏర్పాటు చేసిన చలివేంద్రాలను వినియోగించుకోవాలన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ టి. కృష్ణవేణి, మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News