మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి అందుతున్న అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత సమయంలో సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, ఆర్డిఓ కే స్వాతి లతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక—మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ ప్రజల సమస్యలను ఎంతో ఓపికగా విని సంబంధిత అధికారులను పిలిపించి వారి సమస్యలను వీలైనంతవరకు సానుకూలంగా పరిష్కరించాలని సూచించారు. ఆ ప్రకారంగా కలెక్టరేట్లో మొత్తం 145 అర్జీలు స్వీకరించారు. అందులో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:
ఉంగుటూరు మండలం ఇందుపల్లి గ్రామ నివాసి ఇందుపల్లి యోహాన్ ఉపాధి హామీ పనులలో అవకతవకలు జరిగాయని, తన గ్రామ పరిధిలో పంచాయతీ సెక్రెటరీ అనుమతి లేకుండా ఊర్లో లేని వారి పేర్లు, పనిచేయని వారి పేర్లు, జత చేసి సుమారుగా 200 జాబ్ కార్డులు అక్రమంగా జారీ చేశారని, పనికి రాని వాళ్లకు పూర్తిగా పని దినాలు మస్టర్ వేసి అక్రమ లావాదేవీలు జరుపుతున్నారని, వన్నేరును మూడు భాగాలుగా విభజించి, అంచనా వేసి ఉపాధి హామీ కూలీలు పని చేయకుండానే మస్టర్ వేసి సుమారుగా 21 లక్షల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని, గత సంవత్సరంలో కూడా కొండయ్య కాలువ తవ్వకపోయినా మూడు భాగాలుగా విభజించి పని జరగకుండా పనిచేసినట్లు నాలుగు కిలోమీటర్లకు కూలీలను హాజరు వేసి తవ్వినట్టుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఈ విషయమై విచారణ జరిపి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ కాపురస్తురాలు తనకు రీ సర్వే నెంబరు 760/4 a లో 0.2 సెంట్లు, రీ సర్వే నంబరు 760/5 లో 0.19 సెంట్లు భూమి కలదని అందులో సుమారు 0.38 సెంట్లు భూమి జాతీయ రహదారి 216 కత్తిపూడి నుండి ఒంగోలు రోడ్డుకు తీసుకొని ఉన్నారన్నారు. అధీకృత అధికారి, సంయుక్త కలెక్టర్ అవార్డు నంబరు 36/2015 తేదీ 31 3 2017 ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించలేదని, తన భూమికి నోటిఫికేషన్ సమయంలో ఉన్న మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం ఇవ్వవలసినదిగా కోరుతూ అర్జీ అందజేశారు. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామానికి చెందిన ఫజల్లున్నిసా మహమ్మద్ తనకు 83 సంవత్సరాలని, ఆరోగ్యం బాగాలేదని, తన ఖాతా నంబరు 631 అని తనపై దయవుంచి సర్వే నంబర్ను సరిచేసి కొత్త పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని కోరుతూ అర్జీ అందజేశారు.
*మోపిదేవి మండలం కోసూరి వారి పాలెం గ్రామానికి చెందిన ఎక్కటి మహాలక్ష్మి తనకు సంబంధించిన భూమి మేరకనపల్లి గ్రామంలో ఎల్ పి నంబరు 1340,1353 ఖాతా నంబరు 1983 లో ఉందని సంవత్సరం కిందట రీ సర్వే చేశారని తన భర్త పేరు మీద ఉన్న భూమి రికార్డులను తన పేరు మీదికి మార్చుకోవటానికి ప్రయత్నిస్తుంటే పోర్టల్ లో తప్పు చూపిస్తోందని అందువలన దరఖాస్తు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని అర్జీ అందజేశారు.
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు మచిలీపట్నం కమిటీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ఆపాలని, విధుల నుండి తొలగించిన కాంట్రాక్టు కార్మికులందరినీ విధుల్లోకి మరలా తీసుకోవాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగులకు జీతభత్యాలు సక్రమంగా చెల్లించాలని, సొంత గనులు కేటాయించాలని కోరుతూ అర్జీ అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 23,117 అర్జీలు అందగా, ఇప్పటివరకు 21,269 అర్జీలు పరిష్కరించామని మిగిలిన 1848 అర్జీలు కూడా సత్వరమే పరిష్కరించాలన్నారు.
అర్జీదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి సమస్యను అర్థం చేసుకొని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
పి జి ఆర్ ఎస్—-మీకోసం అర్జీల పరిష్కారంపై ప్రజల్లో సంతృప్తి లేదని, జిల్లాలో మంచి అభిప్రాయం లేదన్నారు.
ఇంకా కొత్త కొత్త సమస్యలు కొనసాగుతున్నాయన్నారు ఇది చాలా విచారించదగ్గ విషయం అన్నారు. మొదట్లో బాగున్నప్పటికీ తరువాత రాను రాను ప్రజల్లో అసంతృప్తి ఏర్పడిందన్నారు. తన వద్ద సమస్యల పరిష్కారానికి సంబంధించి ఎండార్స్మెంట్లు సంతకాలు చేయించుకొని సంబంధిత అర్జీదారులకు పంపడం లేదని తెలుస్తోందన్నారు.
అర్జీలపై తీసుకున్న చర్యలను వివరిస్తూ సంబంధిత అర్జీదారులకు తప్పనిసరిగా సమాధానం తెలుగులో పంపాలన్నారు.
క్షేత్రస్థాయిలో అర్జీదారులతో మాట్లాడే ఉద్యోగులు కఠినంగా ప్రవర్తించడం వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, ఇకపై ఎవరైనా సరే ఓపికగా మర్యాదపూర్వకంగానే అర్జీదారులతో మాట్లాడాలని స్పష్టం చేశారు. కింది స్థాయి ఉద్యోగులకు అర్జీదారులతో సావధానంగా మాట్లాడే విధానం గురించి జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగేలా చూసుకోవలసిన బాధ్యత అధికారులు, ఉద్యోగులపై ఉందన్నారు. ఇందులో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
యోగాంధ్ర కార్యక్రమం ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని, ప్రతి ఒక్క ఉద్యోగి తన పేరును నమోదు చేసుకోవాలని జిల్లా అధికారులు ఆ దిశగా దృష్టి సారించి ఉద్యోగులందరూ నమోదయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ స్థాయిలో మున్సిపల్ కమిషనర్, మండల స్థాయిలో ఎంపీడీవో యోగ పట్టణ, మండల స్థాయి కమిటీలకు చైర్మన్గా వ్యవహరిస్తారని వారు సూచించిన విధముగా మిగిలిన అధికారులు తప్పనిసరిగా నడుచుకోవాలన్నారు. సంయుక్త కలెక్టర్ నోడల్ అధికారిగా జారీ చేసే సూచనలు, సలహాలు విధిగా పాటించాలన్నారు. ఈ నెల 27వ తేదీ మంగళవారం ఉదయం 7 గంటలకు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జడ్పీ కన్వెన్షన్ హాల్ నుండి సాయిబాబా దేవాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని అందులో జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. ఈ ర్యాలీకి కావలసిన ఏర్పాట్లు మున్సిపల్, ఆయుష్ శాఖలు పర్యవేక్షించాలన్నారు.
సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ మాట్లాడుతూ ఐ గాట్ కర్మయోగి ఆన్లైన్ శిక్షణ తరగతులను డీఈఓ డిపిఓ పోలీస్ శాఖలు ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేయాలన్నారు. యోగ పై రాష్ట్రస్థాయి కార్యక్రమం త్వరలో నిర్వహించనున్నామని ప్రతి జిల్లాకు ఒక ఇతివృత్తంతో నిర్వహించడం జరుగుతుందని మన కృష్ణా జిల్లాకు 5000 మంది ఆటో, లారీ రవాణా సంఘాలతో నిర్వహించాల్సి ఉందన్నారు. ఇందుకోసం త్వరలో ఒక సమావేశాన్ని వారితో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు వంటి యోగా ప్రోటోకాల్ పై పోటీలు కూడా నిర్వహిస్తామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికి తిరిగి యోగాంధ్ర కార్యక్రమం లో ప్రజలను భాగస్వాములు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఇన్చార్జి సీఈవో ఆనందకుమార్, డ్వామా, డి ఆర్ డి ఏ, మెప్మా పి డీలు శివప్రసాద్, హరిహరనాథ్, సాయిబాబు, పంచాయతీరాజ్ ఎస్. ఈ .రమణారావు, ఆర్డబ్ల్యూఎస్., రహదారులు భవనాలు ఈఈ లు నటరాజు, లోకేష్, డీఎస్ఓ పార్వతి, డి ఎం హెచ్ ఓ డాక్టర్ శర్మిష్ట, డిపిఓ అరుణ, జిల్లా వ్యవసాయ అధికారి మనోహర్, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి వెంకటరావు, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, డి టి డబ్ల్యూ ఓ ఫణి ధూర్జటి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News