సలహాదారులు పాలన చేస్తుంటే… మంత్రులు దోచుకొనే పనిలో ఉన్నారు…

-మంత్రులకు కనీస మర్యాదలు కూడా దక్కడం లేదు
-పారదర్శక పాలనకు వైసీపీ ప్రభుత్వం పాతర వేసింది
-ప్రభుత్వ అక్రమాలు దాచేందుకే జీవోలు కనిపించకుండా చేసేశారు
-ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేసుకునే కుట్రలో ఇదీ ఓ భాగమా?
-మీడియా సమావేశంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

రాష్ట్రంలో సలహాదారుల పాలన తప్ప ప్రజాప్రతినిధుల పాలన సాగడం లేదు… ప్రజా ప్రతినిధులు అనేవారు ఎక్కడా కనబడడం లేదని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి  పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు. గుంటూరులో శంకుస్థాపనలు కావచ్చు, పోలవరం ప్రాజెక్టుల సందర్శన కావచ్చు… ఏదైనా సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు కనిపించారు… అన్నింటికీ ఒక్కరే ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్తారన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలు ఓట్లు వేసిన మంత్రులు, ఎమ్మెల్యేలతో నడుస్తుందా ముఖ్యమంత్రి పెట్టుకొన్న సలహాదారులతో నడుస్తుందా? మంత్రులకు బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. బుధవారం విజయవాడలో  పోతిన వెంకట మహేష్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ “రాష్ట్రంలో మంత్రులకు ఎమ్మెల్యేలకు విలువే లేదు. పాలన మొత్తం సలహాదారుల చేతుల్లోకి పోయింది. ఉత్సవమూర్తులకన్నా అప్పుడప్పుడు పూజలు చేసి దండలు వేసి నైవేద్య పెడతారు. వీరికి ఆ మర్యాదలు కూడా దక్కడంలేదు. రాష్ట్రంలో సలహాదారులు పాలన చేస్తుంటే… మంత్రులు దోచుకొనే పనిలో ఉన్నారు. ఇసుక అక్రమ రవాణా, మట్టిదోపిడి, మైనింగ్ ఎక్కడ పడితే అక్కడ వేలాది లారీలు తరలించుకుని కోట్లు సంపాదించుకోవడం మాత్రమే వీరికి తెలిసిన పని. వీరికి ప్రజల సమస్యల మీదో రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి లేదు. శాఖల మీద పట్టు లేదు. పనులన్నీ సలహాదారుల చూసుకుంటుంటే మనకేంపని అని అందిన కాడికి దోపిడి చేసే పని మీదే దృష్టిపెట్టారు.

• రహస్య పాలన ఎందుకు చేస్తున్నారు?

రాష్ట్రంలో పారదర్శక పాలనకు, ప్రజాస్వామ్య పాలనకు  జగన్ రెడ్డి  నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం పాతర వేసింది. బ్లాంక్ జీవోల ముసుగులో రహస్య పాలనకు ఎందుకు తెర తీశారు. ఇప్పుడు ఏకంగా జీవోలు ఏవీ ప్రభుత్వ వెబ్ సైట్లో ఉంచకూడదని నిర్ణయం తీసుకోవడం వెనక కుట్ర ఉందనే అనుమానాలు వస్తున్నాయి.  జగన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆయన తండ్రి  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ క్షోభిస్తుంది.

పాలనకు సంబంధించి ప్రతి జోవోనీ అందరికీ తెలిసేలా వెబ్ సైట్లలో ఉంచాలి, ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిని ప్రజలకు తెలియచేయాలనే అంశాలను ముఖ్యమంత్రి ఎందుకు తుంగలో తొక్కుతున్నారో సమాధానం చెప్పాలి. మీరు జారీ చేసే జీవోల్లో అక్రమాలు ఏమైనా ఉన్నాయా? అన్యాయాలు ఉన్నాయా? పదే పదే అవినీతికి సంబంధించిన జీవోలు జారీ చేస్తున్నారా? మీ అక్రమాలపై ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండడం, మీ అక్రమాలను అడ్డుకోవడానికి కోర్టులను ఆశ్రయించడం వల్లే ప్రజా క్షేత్రంలో ఉండాల్సిన జీవోలు ప్రజలకు తెలియకుండా పరిపాలన సాగిద్దామనుకుంటున్నారా? అన్నింటికీ ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజన్న రాజ్యం తెస్తానన్న  జగన్ రెడ్డి, తన తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని తానే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. మీ సోదరి షర్మిళకు ఎలాగూ న్యాయం చేయలేదు… చనిపోయిన తండ్రిని అయినా గౌరవిస్తారనుకుంటే ఇంత ఘోరంగా అవమానిస్తారా?

అసలు పారదర్శక పాలనకు పాతరేసి.. రహస్య పాలనకు ఎందుకు శ్రీకారం చుట్టారు? ఇందులో మనీల్యాండరింగ్ వ్యవహారం ఏమైనా ఉందా? అవినీతి, అక్రమాలు ఉన్నాయా? ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేసుకునే కుట్రలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం వాటిల్లే నిర్ణయం. మీ నిర్ణయం వల్ల ప్రజాస్వామ్య మనుగడ దెబ్బతీనే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

• పథకాల అమలుకు ప్రభుత్వ ఆస్తులు ఎందుకమ్మాలి?

ఈ వ్యవహారాన్ని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్  వారం క్రితమే ప్రశ్నించారు. జీవోలు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమీటని నిలదీశారు. సూట్ కేసు కార్పోరేషన్ల ద్వారా రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారన్న వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. ఇక ఎవరూ ప్రశ్నించకూడదు… సలహాదారుల ఆగడాలను అడగకూడదనే జీవోలను దాచేస్తున్నారు. విజయవాడ, గుంటూరు, విశాఖల్లో ఉన్న విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేసే ప్రక్రియ కోసమే ఈ కార్పోరేషన్లు ఏర్పాటు చేశారు. ఈ ఆస్తులన్నీ అమ్మి పథకాలు అమలుచేయడం వెనుక పెద్ద కుట్ర కూడా దాగి ఉంది. విలువైన ఆస్తుల్ని జగన్ రెడ్డి అండ్ కో కొట్టేయడానికే ఈ సూట్ కేసు కార్పోరేషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రజలకు తెలిసిన ఆస్తులు కొన్నయితే తెలియని ఆస్తులు వందల సంఖ్యలో ఉన్నాయి. దీని వెనుక  జగన్ రెడ్డి కోటరీ బినామీ పేర్లతో కొట్టేయాలన్న కుట్ర దాడి ఉంది. తండ్రి హయాంలో మీరు సంపాదించిన వేల కోట్ల అక్రమ సంపాదనను మీ కంపెనీల్లోకి మార్చుకోవడానికి సూట్ కేసు కంపెనీల్ని సృష్టించినట్టే విలువైన ప్రభుత్వ ఆస్తులు కాజేయడానికి సూటికేసు కార్పోరేషన్లు తెర మీదకు తీసుకువచ్చారన్న విషయం ప్రజలకు అర్ధం అవుతోంది. దానికి పథకాల అమలు అనే అందమైన అబద్దాన్ని ప్రచారం చేస్తున్నారు. అంటే ప్రజలకు వాస్తవాలు తెలియకూడదు. వీరి చీకటి సామ్రాజ్య విస్తరణ కోసం అవినీతి సంపాదన కోసం ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులు కొట్టేయడం కోసం జీవోల వెబ్ సెట్ మూసేశారు.

• దళితుల ఆత్మగౌరవం దెబ్బ తీస్తున్నారు

ముఖ్యమంత్రి గారి దృష్టి అభివృద్ధి మీద కంటే అప్పులు చేయడం మీదే ఉంది. నిత్యం కూల్చివేతలు, విధ్వంసం మీద మినహా ఉపాధి అవకాశాలు సృష్టించడం మీద దృష్టి లేదు. ఎంతసేపూ అప్పులు చేయాలి కమిషన్లు కొట్టేయాలి వేగంగా ఆస్తులు సంపాదించాలన్న అంశం మీదే దృష్టి సారించారు. దళిత మహిళకు హోంశాఖ మంత్రి ఇచ్చాం అని ప్రచారం చేసుకుంటున్న  జగన్ రెడ్డి ప్రభుత్వానికి… హోం గార్డు కూడా హోంమంత్రికి విలువివ్వడం లేదన్న విషయం తెలుసా? లేదా? పోలీస్ శాఖలో బదిలీల నుంచి కీలక నిర్ణయాలన్నీ ప్రధాన సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి కనుసనల్లోనే సాగుతాయి. దళిత మహిళకు హోమంత్రి కట్టబెట్టి  జగన్ రెడ్డి పక్కన ఉండే సజ్జల నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? మీరు దళితులకిచ్చే విలువ ఇదేనా? దళితుల ఆత్మగౌరవం దెబ్బ తింటోంది.

రాష్ట్రం నేరస్తులకు, అక్రమార్కులకు నిలయంగా మారిపోయింది. నెల క్రితం ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో అత్యాచారం జరిగితే క్రిమినల్స్ లో ఒకరిని ఇప్పటికీ పట్టుకోలేదు. గుంటూరులో బీటెక్ విద్యార్ధినిని నడిరోడ్డు మీద ప్రేమోన్మాది హత్య చేస్తే ఇంత వరకు శిక్షిస్తాననడం, పరిహారం ఇస్తామని చెప్పడం మినహా చేసింది లేదు. నేరస్థులకు ప్రభుత్వం అండగా నిలబడుతోంది, శిక్షలు వేయరు అనే నమ్మకం కలగడం వల్లే ముఖ్యమంత్రి ఇంటి పరిసరాల్లోనే నేరాలు చేస్తున్నారు. వైసీపీ నేతలు మహిళల మీద దాడులు జరిగితే గన్ కంటే ముందు జగన్ వచ్చేస్తారని వైసీపీ వాళ్ళు చెప్పారు.  జగన్ రెడ్డి ఏమో తాడేపల్లి ప్యాలెస్ గేటు దాటడం లేదన్న విషయాన్ని ప్రజలంతా గుర్తించారు.

• ఫ్యాన్ రెక్కలు విరుగుతాయి

జనసేన పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలి. సలహాదారులు పాలన ఆపాలి. ప్రజాస్వామ్య పాలన రావాలి. ప్రతి జీవోని వెబ్ సైట్ లో పెట్టాలి. ప్రతి సమాచారాన్ని ప్రజలకు తెలియచేయకపోతే సమాచార హక్కు చట్టం సైతం నిర్వీర్యమవుతుంది. శాంతి భద్రతల్ని గాడినపెట్టే పరిస్థితులు లేనందున ప్రజలు స్వీయరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాం. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్  లాంటి నీతి, నిజాయితీ గల నాయకుడికి, సమస్యలపై బలంగా గళం వినిపిస్తున్న నాయకుడికి మద్దతు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. వైసీపీ ఫ్యాను రెక్కలు విరిచేయడానికి ప్రజలు సిద్ధమయ్యారని తెలియచేస్తున్నాం” అన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *