గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రధానంగా శివారు ప్రాంతాల్లో మౌళిక వసతులైన రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు చేపట్టడానికి ఏఈల వారీగా ప్రతిపాదనలు సిద్దం చేసి, ప్రాధాన్యత క్రమంలో చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ నాయి బ్రాహ్మణ కాలనీ, తుఫాన్ నగర్, భాగ్య నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏఈల వారీగా తమ పరిధిలో ముఖ్యమైన మౌళిక వసతులైన రోడ్లు, డ్రైన్ల, త్రాగునీటి పైప్ లైన్ల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. ప్రతి ప్రాంతంలో సిసి రోడ్లు కాకుండా తొలుత ప్రజల రాకపోకలకు వీలుగా జిఎస్బీ రోడ్లను డ్రైన్లతో కలిపి ప్రతిపాదించాలన్నారు. స్థానికులు అందించే ఫిర్యాదులను ఆయా ప్రాంతాల్లో పర్యటించి, పారిశుద్యం, మౌలిక వసతులను పరిశీలించి, తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సచివాలయ కార్యదర్శులు స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజల నుండి అందే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం పారిశుధ్య పనులపై ప్రజారోగ్య అధికారులతో మాట్లాడుతూ నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ జరిగితే రోడ్ల మీద, ఖాళీ స్థలాల్లో వ్యర్ధాలు ఉండవన్నారు.
పర్యటనలో డిఈఈ శ్రీనివాస్, ఎస్ఎస్ ఎన్వీఎస్ ప్రసాద్, ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News