-దేశం నుంచి నలుగురిని ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం
-ఆరోగ్య శాఖలో డిజిటలైజేషన్‌కు జాతీయ స్థాయిలో లభించిన అరుదైన అవకాశం
-వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ అభినందనలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డిజిటలైజేషన్ సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ రంగంలో స్ఫూర్తిగా ఉన్న డెన్మార్క్ ప్రభుత్వమిచ్చే శిక్షణా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 4 రాష్ట్రాల ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ( ఎబిడియం ) మిషన్ డైరెక్టర్లను ఎంపిక చేయగా, వీరిలో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్, ఎబిడియం మిషన్ డైరెక్టర్ జి.వీరపాండియన్ కూడా ఉన్నారు. అసోం, జమ్యూ కాశ్మీర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అధికారులు వీరపాండియన్ తో కలిసి డెన్మార్క్ వెళ్లనున్నారు.
డెన్మార్క్ ప్రభుత్వం పూర్తి ఖర్చులతో నెల రోజుల పాటు డనీడా ఫెలోషిప్ సెంటర్ ( Danida Fellowship centre) ప్రొగ్రాం కింద అక్టోబర్ 1 నుంచి 31 వరకు వీరికి శిక్షణ ఇవ్వనుంది. ప్రజారోగ్య సంరక్షణలో డిజిటలైజేషన్, సమాచార సేకరణ, వినియోగంను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2021 లో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ను ప్రారంభించింది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ ను అమలు చేయడంలో ముందంజలో ఉంది. ఇప్పటి వరకు దీని అమలులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులకు రూ.20 కోట్లు ప్రోత్సాకాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం డిజిటలైజేషన్ ప్రోగ్రాం కింద రూ. 16 కోట్లు అందుకుంది. ఈ స్థాయిలో దేశంలో ఏ ఇతర రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ నిధుల్ని పొందలేదు.
ఏపీలో ఎబిడిఎం సాధించిన ప్రగతి
రాష్ట్రంలో 4.66 కోట్ల మందికి అభా నంబర్లు నమోదు చేశారు. ఈ సంఖ్య రాష్ట్ర జనాభాలో 92.04 శాతం. దేశంలో ఈ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ స్థానాన్ని సాధించింది. 6.92 కోట్ల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని నమోదు చేయడం ద్వారా రాష్ట్రం దేశంలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. 63,340 మంది వైద్యులు మరియు వైద్య సిబ్బందికి హెచ్‌పిఆర్ నమోదు చేయడం ద్వారా దేశంలో మూడో స్థానంలో రాష్ట్రం నిలిచింది. 21,936 ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థలకు హెచ్ ఎఫ్ఆర్ నమోదు చేసి దేశంలో ఐదో స్థానాన్ని రాష్ట్రం పొందింది. 2.07 కోట్ల మేర స్కాన్ అండ్ షేర్ ద్వారా రోగులు ఎక్కువ సమయం క్యూ లైన్లో నిల్చోకుండా జారీ చేయడం ద్వారా మూడో స్థానాన్ని పొందింది. పై విజయాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటరు మొదలుకుని అన్ని వైద్య సంస్థల్లో డాక్టర్ కేర్ అనే సొంత హెచ్ ఎంఐస్ ని, ఎన్ ఐసి యొక్క నెక్స్ట్ జెన్ ఇ-హాస్పిటల్ హెచ్ ఐఎంఎస్ ను అమలు చేసింది. ఈ పురోగతిననుసరించి నాలుగు రాష్ట్రాల్ని కేంద్రం ఎంపికచేయగా ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది.
వ్యక్తిగత అభా నంబరు, వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి హెల్త్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ( హెచ్ పిఆర్ ) నంబరు, ఆసుపత్రులు, క్లీనిక్‌లకు హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ( హెచ్ ఎఫ్ ఆర్ )లో వివరాల నమోదు, ఆసుపత్రుల్లో రోగులకందించే చికిత్సల వివరాల డిజటలీకరణ, ఆసుపత్రుల్లో రద్దీ నివారణకు ఎలక్ట్రానిక్ టోకెన్ల విధానాన్ని ప్రవేశపెట్టడం, వైద్య సేవలు మొత్తం కంప్యుటీకరణ వంటి కార్యక్రమాల్ని ఎబిడిఎం అమలు చేస్తోంది.
Prajavartha Online Telugu News