
-అంగన్వాడీలను బలోపేతం చేసిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానిది…
-ఎమ్మెల్యే చేతుల మీదుగా పోషకాహార కిట్లు అందజేత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పోషకాహార మాసోత్సవాలలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పౌష్టికాహార మాసోత్సవం కార్యక్రమాన్ని 58వ డివిజన్ లోని షాదీఖానాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళా నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి తో కలిసి శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్బిణీలు, బాలింతలు, చిన్నారులకు వైఎస్సార్ సంపూర్ణ పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. సెప్టెంబరు 1 నుంచి 30వ తేదీ వరకు పోషకాహార మాసోత్సవ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నెల రోజులపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారంపై ఊరూరా అవగాహన కల్పించబోతున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ఈ పోషకాహారం దోహదపడుతుందన్నారు. కనుకనే గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనతను నివారించి సంపూర్ణ ఆరోగ్యం కలిగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడం జరిగిందన్నారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు పాలు, గుడ్లు, ఆకుకూరలు, కూరగాయలు, బాలామృతం వంటి పదార్థాలను అందిస్తోందన్నారు. వీటిని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. పోషకాహారంతో పాటు ఆరోగ్య సూత్రాలను తెలియపరిచేవిధంగా సలహాలు, సూచనలు అందించాలన్నారు. పోషకాహర మాసోత్సవాలలో భాగంగా నియోజకవర్గంలో 13,654 మంది బాలింతలు, గర్భిణీలకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం దాదాపు రూ. 7.50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తునట్లు తెలియజేశారు. ఈ పోషకాహారం క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరికి చేరే విధంగా సూపర్ వైజర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ పై సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం ఉన్న వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలను నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు అవుతు శ్రీనివాస్ రెడ్డి, ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ -1 సీడీపీఓ సువర్ణ, ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ -2 సీడీపీఓ మంగమ్మ, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News