-ప్రతి వారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తాం..
-నగరంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి అర్జీలు స్వీకరించిన మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బృందావన థియేటర్ పక్కన గల నియోజకవర్గ టీడీపి కార్యాలయంలో మంత్రి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను ఓపిగ్గా ఆలకించిన ఆయన వారి సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రతి వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చిన అర్జీలను సమస్యలను బట్టి సంబంధిత అధికారులకు పంపించి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తున్నామన్నారు. నేడు శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 110 అర్జీలు వచ్చాయని, వాటిలో అత్యధికంగా ఇళ్ల స్థలాలు, పింఛన్లకు సంబంధించినవి ఉన్నాయని తెలిపారు. ప్రతి వారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రజలు గమనించి సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.
నిరంతరం వివిధ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే మంచి ప్రభుత్వం అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మొంథా తుపాను సమయంలో అధికారులందరినీ క్షేత్రస్థాయిలో అప్రమత్తం చేసి తుపాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగారన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు నగరంలో వీచిన గాలులకు చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు కూలిపోయాయని, అయితే తక్షణ చర్యలు చేపట్టి స్వల్ప వ్యవధిలోనే చెట్లను తొలగించడం, విద్యుత్ ను పునరుద్ధరించడం జరిగిందన్నారు. ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరించి అసాధారణ పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చిందన్నారు.
కార్యక్రమంలో మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News