-ప్రక్కిలంకలో తెల్లవారుజామున సంయుక్త తనిఖీలు – రెండు వాహనాలు స్వాధీనం
-ఎడి మైన్స్ డీ ఫణి భూషణ్ రెడ్డి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా గనులు & భూగర్భ శాఖ , జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో కలిసి 28.12.2025 తేదీ తెల్లవారుజామున సుమారు 1.30 గంటలకు ప్రక్కిలంక గ్రామంలో ఆకస్మిక సంయుక్త తనిఖీలు నిర్వహించడం జరిగిందనీ జిల్లా మైన్స్ అధికారి డి ఫణి భూషణ్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు.
ఈ తనిఖీల్లో ఇసుకను తరలిస్తున్న AP39TQ0007, AP37TE6979 నంబర్లతో ఉన్న రెండు వాహనాలను గుర్తించి తనిఖీ చేయగా, డ్రైవర్లు చూపిన వే బిల్లులపై ఉన్న QR కోడ్లను ‘విజిలెన్స్ యాప్ ఫర్ సాండ్ బిల్స్’ ద్వారా స్కాన్ చేయగా, యాప్‌లోను, ఆంధ్రప్రదేశ్ ఇసుక నిర్వహణ వ్యవస్థ (APSMS) పోర్టల్లోను ఎటువంటి డిస్పాచ్ వివరాలు లభించలేదనీ గుర్తించడం జరిగింది. అదేవిధంగా, వే బిల్లులపై ముద్రించిన ఫాంట్ శైలి, APSMS డిస్పాచ్ యాప్ ద్వారా జారీ చేసే అసలు వే బిల్లుల ఫాంట్‌కు భిన్నంగా ఉండటంతో, సంబంధిత వే బిల్లులు నకిలీవిగా నిర్ధారణ చేయడం జరిగిందనీ తెలిపారు. ఈ నేపథ్యంలో సదరు రెండు వాహనాలను స్వాధీనం చేసుకొని, తాళ్ళపూడి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు భద్రపరచుటకు అప్పగించామన్నారు.
అలాగే, ప్రక్కిలంక–1 డిసిల్టేషన్ రీచ్‌లో డిసిల్టేషన్ చేసి ఇసుక రవాణాకు ఏజెన్సీగా ఎంపికైన ‘ది గణేష్ బోట్స్‌మెన్ & సాండ్ వర్కర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’ సంస్థ నకిలీ ఇసుక వే బిల్లులు జారీ చేసినట్లు గుర్తించడంతో, చట్ట ప్రకారం తగిన సెక్షన్ల కింద చర్యలు తీసుకునేందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తాళ్ళపూడి పోలీస్ స్టేషన్ అధికారులను కోరారు. తదుపరి చర్యగా, సదరు సొసైటీకి కేటాయించిన శాండ్ సప్లై పాయింట్ లాగిన్ ఐడీని APSMS పోర్టల్‌లో బ్లాక్ చేయడం జరిగింది.
ఇకపై ఏ ఇసుక రీచ్ ఏజెన్సీలు అయినా నకిలీ వే బిల్లులు జారీ చేసినట్లు తేలితే, సంబంధిత ఏజెన్సీని రద్దు చేయడమే కాకుండా, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా గనులు & భూగర్భ శాఖ అధికారి హెచ్చరించారు.
ఈ సంయుక్త ఆపరేషన్‌లో జిల్లా గనులు & భూగర్భ శాఖ సర్వేయర్ పట్నాల శ్రీనివాస్, జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News