Breaking News

సిద్దార్ధ అకాడ‌మీ సృష్టే…విజ‌య‌వాడ అభివృద్దికి కార‌ణం : ఎంపీ కేశినేని శివ‌నాథ్

-సిద్దార్ధ అకాడమీ విద్యా సంస్థల స్వర్ణోత్సవ వేడుకలకు హాజ‌రు
-సీఎం చంద్ర‌బాబు కు స్వాగ‌తం ప‌లికిన ఎంపీ కేశినేని శివ‌నాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సిద్దార్ధ అకాడమీ విజయవాడ అభివృద్ధికి బలమైన పునాదిగా నిలిచిందని ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. సిద్దార్ధ అకాడమీ విద్యాసంస్థల స్వర్ణోత్సవ ముగింపు వేడుకలు విజయవాడలో శ‌నివారం ఘనంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి సిద్దార్ధ అకాడ‌మీ పాల‌క‌మండ‌లి, క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశా, ఉమ్మ‌డి కృష్ణా జిల్లాల ఎమ్మెల్యేల‌ తో క‌లిసి ఎంపీ కేశినేని శివ‌నాథ్ స్వాగ‌తం ప‌లికారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ సిద్దార్ధ అకాడమీ విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల నుంచి అనేక ప్రతిభావంతులను గుర్తించి సమాజానికి పరిచయం చేసిందని, ఈ ప్రాంత ప్రజలు దేశ విదేశాల్లో స్థిరపడి ఆర్థికంగా ఎదగడంలో అకాడమీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. నేడు విజయవాడ ప్రాంతం నుంచి విదేశాల్లో స్థిరపడిన వారిలో సుమారు 70 శాతం మంది సిద్దార్ధ అకాడమీ నుంచి విద్యాభ్యాసం చేసి వెళ్లిన వారేనని ఆయన అన్నారు.

అకాడమీ పెద్దలు నిస్వార్థంగా ప్రతిభను గుర్తించి సీట్లు కేటాయించేవారని, ఎలాంటి సిఫారసులకు లొంగకుండా విద్యార్థులను ప్రోత్సహించడమే వారి ప్రత్యేకతగా నిలిచిందని ప్రశంసించారు. సిల్వర్ జూబ్లీ సందర్భంగా కూడా, నేటి గోల్డెన్ జూబ్లీ వేడుకలకు కూడా ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు హాజరుకావడం ఎంతో గర్వకారణమని ఎంపీ కేశినేని శివ‌నాథ్ పేర్కొన్నారు.

ఇది సిద్దార్ధ అకాడమీకి దక్కిన విశేష గౌరవమని అన్నారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట–నందిగామ ప్రాంతంలో ఒక అగ్రికల్చరల్ కాలేజీ ఏర్పాటు చేయాలని, అలాగే సిద్దార్ధ అకాడమీకి డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పిస్తే విజయవాడ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతుందని తెలిపారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ దిశగా మాట్లాడుతూ, అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్‌గా, విశాఖపట్నం డేటా సెంటర్ కేంద్రంగా అభివృద్ధి చెందబోతున్నాయని చెప్పారు. 2047 నాటికి ‘స్వర్ణాంధ్రప్రదేశ్’ను చూడబోయేది ఇక్కడ ఉన్న భావి భారత పౌరులేనని, అందుకే ఈ ప్రాంతంలోనే స్థిరపడి ప్రాంత అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. విద్య, విజ్ఞానం, పరిశోధనలతోనే రాష్ట్రానికి సుస్థిర భవిష్యత్తు సాధ్యమని పేర్కొంటూ, సిద్దార్ధ అకాడమీ వంటి సంస్థలు మరింత విస్తరించి తరతరాలకు మార్గదర్శకంగా నిలవాలని ఎంపీ ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *