Breaking News

చేనేతలందరికీ ఉచిత విద్యుత్

-శాసనమండలిలో మంత్రి సవిత
-ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ అమలు
-మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు
-మర మగ్గం నేతన్నలకు 500 యూనిట్లు ఉచితం
-వైసీపీ ప్రభుత్వంలో ఆప్కో నిర్వీర్యం
-రూ.120 కోట్లు దారి మళ్లించిన గత ప్రభుత్వం
-చేనేత సహకార సంఘాల బకాయిలు చెల్లిస్తున్నాం
-ఆ సంఘాల నుంచి అవసరమైన మేరకు చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాం : మంత్రి సవిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ అందజేయనున్నామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. చేనేత వృత్తిలో కొనసాగే వారందరికీ ఈ పథకం వర్తింపజేయనున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మూడో రోజు శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తర సమయంలో వైసీపీ సభ్యులు మురుగుడు హనుమంతరావు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత పైవిధంగా సమాధానం చెప్పారు.
పోగును వస్త్రంగా మార్చి మనుష్యుల ఆత్మగౌరవాన్ని కాపాడే మహానీయులు నేతన్నలని కొనియాడారు. చేనేతలకు అన్న ఎన్టీఆర్ తొలుత అండగా నిలుస్తే, 2014-19లో సీఎం చంద్రబాబునాయుడు పాలన నేతన్నలకు స్వర్ణయుగంలా గడిచిందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ అందజేయబోతున్నామన్నారు. చేనేత వృత్తిలో ఉన్న వారందరూ ఉచిత విద్యుత్ కే అర్హులేనన్నారు. మగ్గం నేసే నేతన్నలకు 200 యూనిట్ల అందజేయబోతున్నామని, దీనివల్ల ఆయా నేతన్నల కుటుంబాలకు నెలకు రూ.720లు, ఏడాదికి రూ.8,640లు ఆదా కానుందన్నారు. మర మగ్గం నేసే నేతన్నలకు 500 యూనిట్లు ఉచితంగా సరఫరా చేయనున్నామని, దీనివల్ల ఆయా కుటుంబాలకు రూ.1,800లు, ఏడాదికి రూ.21,600 ఆర్థికంగా మేలు చేకూరనుందన్నారు. 2014-19 మాదిరిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత కూడా త్రిఫ్ట్ ఫండ్ నిధులు అందజేస్తున్నామన్నారు. అవసరమైన మేరకు చేనేత సహకార సంఘాల నుంచి చేనేత వస్త్రాలు కొనుగోలు చేస్తున్నామని, గతంలో చేనేత సహకార సంఘాలకు పెట్టిన బకాయిలు కూడా చెల్లిస్తున్నామని వెల్లడించారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు పెన్షన్లు ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదేనని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత నేతన్నలకు ఇచ్చే పెన్షన్ల మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచామని, నేటి వరకూ రూ.495 కోట్లు పెన్షన్ల రూపంలో అందజేశామని వెల్లడించారు.

దారి మళ్లిన రూ.120 కోట్లు రాబడతాం…

నేతన్నల కష్టాలకు గత ప్రభుత్వమే కారణమని మంత్రి సవిత స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఆప్కోను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఆప్కో పేరుతో కేంద్రం నుంచి తీసుకొచ్చిన రూ.120 కోట్లు గత దారి మళ్లించిందన్నారు. ఆ నిధులు ఏవిధంగా వాడారో కూడా తెలియడం లేదన్నారు. దారి మళ్లిన రూ.120 కోట్లను రాబట్టడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతోందని స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి ఆప్కోలో మురుగు పోతున్న పాత స్టాక్ ను తొలగించి కొత్తగా కొనుగోలు చేసిన వస్త్రాలను అమ్మకాలకు పెడుతున్నామన్నారు. దీనివల్ల ఆప్కోలో అమ్మకాలు గణనీయంగా పెరిగాయన్నారు. చేనేత వస్త్రాల అమ్మకాలు మరింత పెరిగేలా టాటా, తనేరియా, బిర్లా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. వస్త్రాల తయారీలో నేతన్నల స్కిల్ పెరిగేలా బాపట్ల, గుంటూరు, తూర్పు గోదావరి, తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

నూతన పాలసీతో 2 లక్షల మందికి ఉపాధి

చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు నూతన టెక్స్ టైల్స్ పాలసీని రూపకల్పన చేశారని మంత్రి సవిత తెలిపారు. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు రాబట్టే చర్యలు తీసుకుంటున్నామన్నారు. నూతన పాలసీతో చేనేత రంగంలో రెండు లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది ప్రధాన ఉద్దేశమన్నారు. చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి చేనేత వస్త్రాల అమ్మకాలను పెంచామన్నారు. ఈ కామర్స్ లోనూ చేనేత అమ్మకాలు చేస్తున్నామని, ఆన్ లైన్ సేల్స్ ద్వారా అమ్మకాలు మరింత పెరిగాయని తెలిపారు. గత ప్రభుత్వంలో నేతన్న భరోసా పథకం మాత్రమే అమలు చేసి చేతులు దులుపుకుందని, ఈ పథకం అమలులో అర్హత లేని వైసీపీ కార్యకర్తలకు 40 వేల మందికి లబ్ధి చేకూర్చారని మంత్రి సవిత మండిపడ్డారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *