విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ మానవాళిని ఖురాన్ దివ్య బోధనలతో ప్రభావితం చేసిన మహోన్నత వ్యక్తి మహ్మద్ ప్రవక్త అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మహ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలను సెంట్రల్ నియోజకవర్గంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వాంబేకాలనీలోని ఆస్థాన – ఎ – గరీబ్ నవాజ్ ఖాజా బాబా ఆశ్రమంలో జరిగిన వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ కరీమున్నీసా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపక ధర్మకర్త పఠాన్ బాబ్జీ ఉమర్ ఖాన్ ఇస్లాం సాంప్రదాయం ప్రకారం వీరిని సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి శాసనసభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా వేడుకలు నిర్వహిస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. మహ్మద్ ప్రవక్త బోధనలు ప్రపంచ మానవాళికి ప్రేమ, సోదరభావం, ధర్మంపై నమ్మకం కలిగించిందని మల్లాది విష్ణు అన్నారు. సర్వమానవాళి శ్రేయస్సు కోసం ప్రవక్త జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఆ మహనీయుడు సూచించిన మార్గంలో నడుస్తూ.. సమాజ హితం కోసం ప్రతిఒక్కరూ పాటుపడినప్పుడే మహ్మద్ ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రానున్న రోజుల్లో ముస్లిం సోదరసోదరీమణులందరూ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ ఎండి. షాహినా సుల్తానా, కో-ఆప్షన్ సభ్యులు అలీం, మైనార్టీ నాయకులు రుహుల్లా, హఫీజుల్లా, స్థానిక నాయకులు బత్తుల దుర్గారావు, బాబు తదితరులు పాల్గొన్నారు.