అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేసిన ప్రజెంటేషన్ “సర్క్యులర్ ఎకానమీ బ్లూప్రింట్” అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షించింది.వ్యవసాయం మరియు ఆక్వా రంగాల ద్వారా వచ్చే వ్యర్థాలను పర్యావరణానికి ముప్పుగా కాకుండా, అత్యంత విలువైన బయో-ఉత్పత్తులుగా, సంపదగా ఎలా మార్చవచ్చో ఆమె తన ప్రజంటేషన్లో కళ్లకు కట్టినట్లు వివరించారు.
పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయం పరంగా ఎంతో సంపన్నమైనదని, 2026 నాటికి తలసరి ఆదాయం రూ. 3.5 లక్షలు దాటబోతోందని, కానీ పారిశ్రామిక రంగం మాత్రం కేవలం 16 శాతం వాటాతో వెనుకబడి ఉందన్న వాస్తవాన్ని ఆమె సభ ముందు ఉంచారు. కేవలం వ్యవసాయంపైనే ఆధారపడకుండా, జిల్లాను పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేయడానికి ఈ వ్యర్థాల నుంచి సంపద సృష్టించే (వేస్ట్ టు వెల్త్) మోడల్ ఒక గొప్ప పరిష్కారమని కలెక్టర్ స్పష్టం చేశారు.
ముఖ్యంగా వరి, ఆక్వా, పశుసంపద, మరియు కోకో.. ఈ నాలుగు రంగాల్లో వ్యర్థాలను ఎలా వాడుకుంటున్నారో కలెక్టర్ నాగరాణి సవివరంగా వెల్లడించారు.వరిని కేవలం ఆహార పంటగానే కాకుండా పారిశ్రామిక ముడిసరుకుగా భావిస్తున్నామని, వరి పొట్టు నుంచి విద్యుత్ మరియు సిలికా జెల్, తవుడు నుంచి రైస్ బ్రాన్ ఆయిల్, అలాగే నూకలు మరియు గడ్డి నుంచి ఇథనాల్ తయారు చేసేలా అడుగులు వేస్తున్నామని తెలిపారు.
ఇక ఆక్వా రంగంలో రోజూ దాదాపు 30 నుంచి 40 టన్నుల వరకు వృథాగా పోతున్న చేపలు, రొయ్యల వ్యర్థాలతో (పొలుసులు, చర్మం తదితర) విలువైన ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా, ప్రస్తుతం ఉన్న 10 కోట్ల రూపాయల ఎగుమతులను ఏకంగా 50 కోట్ల రూపాయలకు (400 శాతం వృద్ధి) పెంచే అవకాశం ఉందన్నారు. పశువుల పేడ ద్వారా బయోగ్యాస్ తయారు చేసి వంటగ్యాస్ కష్టాలు తీర్చడంతో పాటు, నాణ్యమైన సేంద్రియ ఎరువులు అందించేందుకు రాబోయే రెండేళ్లలో జిల్లాలో 40 వేల బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.
వ్యర్థాల నిర్వహణతో పాటు స్థానికంగా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని చెబుతూ, కోకో పంట ద్వారా డ్వాక్రా మహిళలు సొంతంగా తయారు చేస్తున్న చాక్లెట్ బ్రాండ్లను కలెక్టర్ సభకు పరిచయం చేశారు.
తాడేపల్లిగూడెం మండల సమాఖ్య ఆధ్వర్యంలో తయారవుతున్న “చోకో టేల్స్”, ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో తయారవుతున్న “ది స్లో బీన్” చాక్లెట్లు ఎంతో నాణ్యతతో ఏడాదికి లక్షల్లో టర్నోవర్ సాధిస్తున్నాయని, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా వీటినే వాడాలని ఆమె సూచించారు. ఈ సర్క్యులర్ ఎకానమీ విధానాలకు క్షేత్రస్థాయిలో అద్భుతమైన స్పందన వస్తోందని, ఇటీవల భీమవరంలో నిర్వహించిన సదస్సులో 500 మందికి పైగా మిల్లర్లు, స్థానిక ప్రతినిధులు ముందుకు వచ్చి దాదాపు రూ. 60 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యారని ఆమె వివరించారు.
పారిశ్రామిక అభివృద్ధి కోసం కేవలం ఒకే చోట కాకుండా వికేంద్రీకరణ పద్ధతిలో తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం నియోజకవర్గాల్లో భూసమీకరణ ద్వారా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. కేవలం వ్యవసాయ ఉత్పత్తులను పండించే జిల్లాగా మిగిలిపోకుండా, వ్యర్థాల్లేని (జీరో-వేస్ట్) పారిశ్రామిక కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా మారుతోందని, ఈ అద్భుతమైన బ్లూప్రింట్ భవిష్యత్తులో దేశానికే ఒక ఆదర్శ నమూనాగా నిలుస్తుందని నాగరాణి తెలిపారు.
Prajavartha Online Telugu News