Breaking News

జొన్నగిరి గోల్డ్ మైన్స్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బంగారు బాట

-మైనింగ్ రంగాన్ని సంపద సృష్టించే శక్తిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం
-గత ప్రభుత్వ దుర్మార్గాల కారణంగా మైనింగ్ రంగం భ్రష్టుపట్టిపోయింది
-సహజ వనరుల వినియోగంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్న మంత్రి కొల్లు రవీంద్ర

కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర మైనింగ్ రంగంలో అపారమైన వనరులున్నాయని, వాటిని సంపద సృష్టించే శక్తిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యఃమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామ సమీపంలో ఉన్న జియో మైసూర్ సర్వీసెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న గోల్డ్ మైన్స్‌ను పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ బాబుతో కలిసి సందర్శించారు. గోల్డ్ మైనింగ్ కార్యకలాపాలు, ఆధునిక సాంకేతిక పద్ధతులు, ఖనిజ శుద్ధి ప్రక్రియలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మైనింగ్ రంగాన్ని అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలంగా మలచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. జొన్నగిరి గోల్డ్ మైన్స్‌లో అత్యాధునిక యంత్రాంగం, నూతన సాంకేతిక పద్ధతులు ఉపయోగిస్తున్న తీరు ఆకట్టుకుందని పేర్కొన్నారు. గతంలో గోల్డ్ మైన్స్‌ను సందర్శించిన సందర్భంలో అక్కడి పరిస్థితులతో పోలిస్తే జొన్నగిరిలో సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం గనుల్లో సుమారు 300 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో రెండు కిలోమీటర్ల లోతు వరకు వెళ్లే అవకాశముందని తెలిపారు. లోతుకు వెళ్లే కొద్దీ బంగారం నిల్వలు మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు సగటున ఒక కిలో బంగారం ఉత్పత్తి అవుతుండగా, నెలకు సుమారు 30 కిలోల వరకు ఉత్పత్తి చేస్తున్నారని వెల్లడించారు. ఒక టన్ను ఖనిజంలో సుమారు ఒక గ్రాము బంగారం లభిస్తోందని చెప్పారు. జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో సుమారు 13 వేల టన్నుల వరకు ఖనిజ నిల్వలు ఉన్నాయని అంచనా వేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు రెండు లక్షల టన్నుల ఖనిజాన్ని ప్రాసెసింగ్ చేసినట్లు వివరించారు. ఈ గోల్డ్ మైన్ దేశంలోనే తొలి ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తోందన్నారు. రాష్ట్రంలో మైనింగ్ రంగంలో ఇంకా విస్తృత అవకాశాలు ఉన్నాయని, అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో కూడా గోల్డ్ మైనింగ్‌కు అనుకూల ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. త్వరలోనే అక్కడి ప్రక్రియలను పూర్తి చేసి అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ కాలంలో మైనింగ్ రంగం నిర్లక్ష్యానికి గురైందని, ఖనిజ సంపదను రాష్ట్ర అభివృద్ధికి వినియోగించకుండా కొందరి ప్రయోజనాలకే పరిమితం చేశారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఖనిజ సంపదను రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. రాష్ట్ర తీరప్రాంతాల్లో లభించే రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉందని, చైనాకు పోటీగా నిలిచే స్థాయిలో మన దేశంలో ఖనిజ వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ అభివృద్ధికి అవసరమైన బ్లాకులను గుర్తించి టెండర్ ప్రక్రియలు పూర్తి చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా క్వార్ట్జ్ ఖనిజానికి విలువ ఆధారిత పరిశ్రమలు తీసుకువచ్చి, సోలార్ ప్యానెల్స్ వంటి ఉత్పత్తులను రాష్ట్రంలోనే తయారు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. దీని ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని చెప్పారు. అలాగే రాష్ట్రంలో లభించే గ్రానైట్‌కు అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉందని, వాటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి అలంకార వస్తువుల తయారీకి ప్రోత్సాహం అందించనున్నట్లు వెల్లడించారు. జొన్నగిరి గోల్డ్ మైన్స్‌ను ముఖ్యమంత్రి త్వరలో సందర్శించే అవకాశముందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఖనిజ సంపదను సమర్థంగా వినియోగించి మైనింగ్ రంగంలో గత ఏడాదితో పోలిస్తే 30 శాతం వృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం కృషి చేసిందన్నారు. భవిష్యత్తులో మైనింగ్ రంగం ద్వారా రాష్ట్రానికి మరింత ఆదాయం, ఉపాధి, పారిశ్రామికాభివృద్ధి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ఐదు సంవత్సరాలు మైనింగ్ రంగాన్ని జగన్ రెడ్డి నాశనం చేశారు. క్వార్ట్ లాంటి మినరల్స్ మరింత దారుణంగా దోచుకుని జేబులు నింపుకున్నారు. కేసులు పెట్టి క్వారీలను లాక్కోవడంతో మైనింగ్ ఆదాయం పూర్తిగా నిలిచిపోయింది. ఆ పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని, భవిష్యత్తులో అత్యుత్తమ రంగంగా తీర్చిదిద్దుతామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఓబులేసు, టిడిపి జిల్లా అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మ, బోయ కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ, గ్రంథాలయ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ (ఇంచార్జ్) నాగిని, డి.ఎస్.పి వెంకటరామయ్య .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *