-ప్రతి రైతు వివరాలు ఈ-క్రాప్ లో నమోదు రైతు చేయాలి…
-జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవిలత
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సాగులో రైతులు ఎదుర్కొనే ప్రతీ సమస్యకి రైతు స్పందన లో పరిష్కారం లభిస్తుందని జాయింట్ కలెక్టర్ డా.కె.వి.మాధవీలత అన్నారు.
స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన రైతు స్పందన కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో కలసి రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా మాధవిలత మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారానికే రైతు స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి రైతు తన భూమి విస్తీర్ణం, పండించే పంట, తదితర వివరాలను తప్పనిసరిగా ఈ – క్రాప్ లో నమోదు చేసుకోవాలన్నారు. ఈ-క్రాప్ నమోదుపై గ్రామ సచివాలయలు, రైతు భరోసా కేంద్రాల సిబ్బంది రైతులకు అవగాహన కలిగించి ప్రతీ రైతు ఈ-క్రాప్ లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ-క్రాప్ నమోదు తో ప్రభుత్వం అందించే రైతు భరోసా, వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ సబ్సిడీలు పొందవచ్చని, అంతేకాక రైతు భరోసా కేంద్రాలు ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీ, తుఫానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట దెబ్బతిన్నపుడు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడి వంటి పరిహారం అందించడం జరుగుతుందన్నారు. రైతు స్పందన కార్యక్రమంలో రైతుల సమస్యల పై వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఆదేశాలు మేరకు నెలలో ప్రతి మొదటి, మూడవ బుధవారం రైతు స్పందన కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ నరసింహారావు, ఎంపీడీఓ, వ్యవసాయ శాఖ, పశుసంవర్థక శాఖఇరిగేషన్, మత్స్య శాఖ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News