-శంకుస్థాపన భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
చందర్లపాడు, నేటి పత్రిక ప్రజావార్త :
పొక్కునూరు గ్రామంలో శ్రీరామాలయం దేవాలయ నిర్మాణానికి నిర్వహించిన శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, ఆలయాలు భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులుగా నిలుస్తాయని పేర్కొన్నారు. గ్రామాల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడంలో దేవాలయాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.శ్రీరామాలయం నిర్మాణం గ్రామ ప్రజల భక్తి, ఐక్యతకు ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించిన ఆమె, గ్రామాభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక అభివృద్ధికి కూడా కూటమి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తై భక్తులకు సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లాల్ బహుదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News