Breaking News

తెలుగు వైభవాన్ని చాటేలా ప్రతి ఏటా ‘తెలుగు మహోత్సవం’: సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్

-రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తెలుగు మహోత్సవాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశం
-ఉండవల్లి గుహల వద్ద ఘనంగా ముగిసిన రెండు రోజుల తెలుగు మహోత్సవ వేడుకలు.. ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్
గేష్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు భాషా, సాంస్కృతిక వైభవాలు నలుదిశలా వెలుగొందేలా ఇకపై ప్రతి ఏటా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ‘తెలుగు మహోత్సవం’ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మక సమితి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల ప్రాంగణంలో రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన “తెలుగు మహోత్సవం” ముగింపు వేడుకలకు మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రాంగణానికి విచ్చేసిన మంత్రివర్యులకు జానపద కళారూపాలు, మంగళవాయిద్యాలతో నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమం అనంతరం తెలుగు భాష వ్యాప్తి కోసం కృషి చేసిన పలువురు కవులను, డిజిటల్ మాధ్యమంలో తెలుగు ఉనికి కోసం పోరాడుతున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను మంత్రి దుర్గేష్ సన్మానించారు.

తెలుగు భాషపై ఉన్న ప్రత్యేక అభిరుచితో తనకు ఎంతో ఇష్టమైన ‘విశ్వక్సేనుడు’ అనే పదాన్ని మంత్రి దుర్గేష్ స్వయంగా తన దస్తూరితో రాసి భాషాభిమానాన్ని చాటుకున్నారు. మట్టి వాసనలు పరిమళించేలా కుండల తయారీని పరిశీలించారు. కాలిగ్రఫీ ద్వారా తన సంతకాన్ని తెలుగులో రాయడాన్ని ఆసక్తిగా గమనించారు. ప్రాచీన జానపద కళ రూపమైన తోలుబొమ్మలాటను స్వయంగా వీక్షించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మిషన్ స్కూల్‌లో రెండవ తరగతి చదువుతూనే అత్యంత స్పష్టతతో భగవద్గీత శ్లోకాలను పఠించిన ఒక చిన్నారిని మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు.భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జున రావు గీసిన ప్రత్యేక ఛాయాచిత్రాన్ని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సింహాద్రి వాణి రచించిన కవితా కుసుమాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా సామెతల చెట్టును ఆసక్తిగా తిలకించారు.

తెలుగు భాషా పరిరక్షణ, సాంస్కృతిక వైభవ పునరుద్ధరణే కూటమి ప్రభుత్వ లక్ష్యం: పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్

మాతృభాషతోనే విద్యార్థుల్లో సర్వతోముఖాభివృద్ధి

తెలుగు భాషను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టాలనే ఉన్నతమైన ఉద్దేశంతోనే చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఉండవల్లి గుహల వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో తెలుగును విరివిగా ఉపయోగిస్తూ, భావితరాలకు దీనిని అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆంగ్ల భాషా పరిజ్ఞానం నేటి అవసరమే అయినప్పటికీ, మాతృభాషను ఏమాత్రం విస్మరించకూడదని విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక స్థాయిలో బోధన మాతృభాషలోనే సాగినప్పుడు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా దృక్పథం పెరుగుతాయని, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రాధాన్యతను గుర్తించే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రాథమిక విద్యలో తెలుగు భాషను తప్పనిసరి చేసిందని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్లక్ష్యాన్ని అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ప్రాచీన భాషా పరిణామక్రమంపై డాక్యుమెంటేషన్

తమిళుల తరహాలో ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన తెలుగు భాషా పరిణామక్రమాన్ని సమగ్రంగా వివరించేలా ఒక ప్రత్యేక డాక్యుమెంటేషన్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. తెలుగు సాహిత్యాన్ని గ్రంథస్థం చేస్తూ, అక్షర రూపాన్ని పరిరక్షిస్తూ భావితరాలకు అందించేందుకు కూటమి ప్రభుత్వం నూరు శాతం ప్రోత్సాహాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. మాతృభాష ఏమాత్రం మృతభాషగా మారకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

జానపద కళారూపాలు, నాటక రంగానికి పూర్వవైభవం

మన రాష్ట్రానికి సొంతమైన పద్య నాటకంతో పాటు తోలుబొమ్మలాట, హరికథ, బుర్రకథ వంటి ప్రాచీన జానపద కళారూపాలను, పౌరాణిక, సాంఘిక నాటకాలను, పద్య నాటకాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి దుర్గేష్ ఉద్ఘాటించారు.

కళాకారులకు ప్రోత్సాహం:

ఇప్పటికే కవులు, కళాకారులు, సాంస్కృతిక రంగానికి పెద్దపీట వేస్తూ ఉగాది కళారత్న పురస్కారాలు, తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా కందుకూరి పురస్కారాలు మరియు తెలుగు భాషా పురస్కారాలను, గుర్రం జాషువా, బోయి భీమన్న పురస్కారాలను అందించామని తెలిపారు.నాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు త్వరలోనే నంది నాటకోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా తెలుగు ఉన్నతికి కృషి చేసిన మండలి వెంకట కృష్ణారావు శతజయంతి ఉత్సవాలను ఆగస్టు 4న విజయవాడలో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.అదే విధంగా వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 29న ఘనంగా తెలుగు భాషా దినోత్సవాన్ని, తెలుగు పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా తెలుగు భాషా వికాసానికి కృషి చేసిన మహనీయులను స్మరించుకున్న మంత్రి దుర్గేష్ తెలుగు భాషకు నిజమైన రాయబారి మండలి బుద్ధ ప్రసాద్ అని కొనియాడారు. అలాగే తెలుగు భాషా పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న తేజస్వి పొడపాటి సేవలను అభినందించారు

భాషా వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్

అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ.. కాక్రోచ్ ఉద్యమం మాదిరిగా ప్రతి ఒక్కరూ తెలుగు భాషా పరిరక్షణకు, ఉనికికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. మంత్రి కందుల దుర్గేష్ పర్యాటక, భాషా సాంస్కృతిక రంగాల అభివృద్ధికి, భాషా వికాసానికి విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. తాము గతంలో భాష కోసం అనేక పోరాటాలు చేశామని, అయితే తొలిసారిగా యువతను భాగస్వామ్యం చేస్తూ “తెలుగు భవితను” ప్రోత్సహించేలా ఇలాంటి మహోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.

తెలుగును ముందటి తరాలకు అందించే ప్రయత్నమే ‘తెలుగు మహోత్సవం’: ఏపీ సృజనాత్మక, సాంస్కృతిక సమితి చైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి

మన మాతృభాష తెలుగును భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందించాలనే సంకల్పంతోనే ‘తెలుగు మహోత్సవం’ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు సాంస్కృతిక సమితి చైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి తెలిపారు. తెలుగు అత్యంత అందమైన, శ్రవణ సుందరమైన భాష అని కొనియాడిన ఆమె, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భాషా వికాసానికి కృషి చేసిన మహనీయులను స్మరించుకున్నారు. నాటి వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు నుండి నేటి తరంలో భాషా సమృద్ధికి, పత్రికారంగానికి వన్నె తెచ్చిన ఈనాడు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు వరకు తెలుగు భాష కోసం చేసిన విశేష కృషిని వివరించారు. తెలుగు భాష ఉనికి కోల్పోకుండా, అంతరించిపోకుండా కాపాడుకోవడమే ధ్యేయంగా ఇటువంటి వేడుకల ద్వారా నేటి తరం పిల్లలు, యువతలో భాష పట్ల పూర్తి అవగాహన నింపుతున్నామని చెప్పారు. నేటి తరం పిల్లలకు తెలుగుపై ఎలాంటి ద్వేషం లేదని, అయితే భాషను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా వారి నిత్య జీవితంలో అనుభవపూర్వకంగా ఉపయోగించే వాతావరణాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వంలో తెలుగు భాషకు, సంస్కృతికి అత్యంత ప్రాధాన్యత లభిస్తుందని, రాబోయే రోజుల్లో భాషకు మంచి రోజులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మనందరం ఐక్యంగా నిలబడి తెలుగు భాషా ఉనికిని, అస్తిత్వాన్ని కాపాడుకుందామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

మండలి వెంకటకృష్ణా రావు అధికార భాష సంఘం చైర్మన్ త్రివిక్రం రావు మాట్లాడుతూ.. తెలుగు ఉనికి కోసం, ఉన్నతి కోసం ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని అన్నారు. తెలుగు అంతరించి పోయే ప్రమాదం లేదన్నారు. తెలుగు భాషా వికాసం కోసం మంత్రి కందల దుర్గేష్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు.

మంత్రి కందుల దుర్గేష్ చొరవతోనే ఈ ఉత్సవం: రేగుళ్ల మల్లికార్జున రావు

రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జున రావు మాట్లాడుతూ.. మంత్రి కందుల దుర్గేష్ చూపిన ప్రత్యేక శ్రద్ధ, చొరవ వల్లే చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఉండవల్లి గుహల వద్ద ఈ మహోత్సవాన్ని అత్యంత జయప్రదంగా నిర్వహించగలిగామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఈ వేదికను ఏర్పాటు చేసినందుకు మంత్రి దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం ప్రముఖ గాయని శోభరాజ్ తెలుగు భాషా తియ్యదనాన్ని, దాని విశిష్టతను వివరిస్తూ అన్నమయ్య గేయాలు ఆలపించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *