-కళా, రక్షణ రంగాలకు వారి కృషితో తెలుగు వారికి ఘన కీర్తి
-చిరంజీవి సినిమాలకు నక్షత్రాలు కట్టా
-హైదరాబాదులో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి, రక్షణ రంగంలో శాస్త్రవేత్త జి.సతీశ్‌రెడ్డి తెలుగు ప్రజలు గర్వించదగ్గ ప్రముఖులని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. చిరంజీవి తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకోగా, సతీశ్‌రెడ్డి దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసిన మేటి శాస్త్రవేత్తగా నిలిచారని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఆదివారం బీవీ పట్టాభిరామ్ పేరుతో ఏర్పాటు చేసిన తొలి పురస్కారాన్ని సతీశ్‌రెడ్డికి ప్రదానం చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని, సతీశ్‌రెడ్డితో ఉన్న 35 ఏళ్ల అనుబంధాన్ని సత్యకుమార్ గుర్తుచేసుకున్నారు.
చిరంజీవి సినిమాలకు నక్షత్రాలు కట్టా
తాను 15 ఏళ్ల వయసులో బళ్లారిలో పీయూసీ చదువుతున్న సమయంలో చిరంజీవి సినిమా విడుదలైతే థియేటర్ వద్ద పెద్ద నక్షత్రాలను కట్టేవారమని మంత్రి తెలిపారు. ‘కిరాతకుడు’ సినిమా విడుదలైనప్పుడు రాత్రంతా థియేటర్ వద్ద ఉండి నక్షత్రం కట్టామని, ఆ తర్వాత ‘దొంగ మొగుడు’ చిత్రానికీ అదే విధంగా చేసినట్లు గుర్తుచేశారు.
‘‘ఆ సినిమా పేర్లలో కాస్త ప్రతికూలత కనిపించవచ్చు. కానీ చిరంజీవిగారిలో మాత్రం అలాంటి ప్రతికూలత ఏ కోశానా లేదు. ఆయన మంచి మనసున్న మెగాస్టార్’’ అని సత్యకుమార్ వ్యాఖ్యానించారు. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధాప్యం వస్తుందని అంటారని, చిరంజీవి, సతీశ్‌రెడ్డిని చూస్తే మాత్రం రోజురోజుకూ మరింత యువకులుగా, ఉత్సాహంగా కనిపిస్తున్నారని మంత్రి చమత్కరించారు.
కలాం మాటను నిజం చేసిన సతీశ్‌రెడ్డి
సతీశ్‌రెడ్డితో తనకు విద్యార్థి దశ నుంచి పరిచయం ఉందని సత్యకుమార్ తెలిపారు. సతీశ్‌రెడ్డి ప్రతిభను మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పాతికేళ్ల క్రితమే గుర్తించారని చెప్పారు. ‘‘సతీశ్‌రెడ్డి ఎంతో ప్రతిభావంతుడు. ఒకరోజు దేశానికి శాస్త్రీయ సలహాదారుగా, డీఆర్‌డీవో అధిపతిగా ఎదుగుతారు’’ అని కలాం అప్పట్లో చెప్పిన మాటలను గుర్తుచేశారు.
ఆ తర్వాత వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో అదనపు వ్యక్తిగత కార్యదర్శిగా రావాలని సతీశ్‌రెడ్డిని కోరారని మంత్రి తెలిపారు. ఆ విషయంపై తన సలహా అడిగినప్పుడు రాజకీయ పదవులవైపు కాకుండా శాస్త్రరంగంలోనే కొనసాగాలని చెప్పినట్లు వివరించారు. ‘‘అబ్దుల్ కలాం వంటి గొప్ప శాస్త్రవేత్త ఆయన భవిష్యత్తును అప్పుడే గుర్తించారు.
ఆయన జ్ఞానంతో నాకు చప్పట్లు…
ఒక కార్యక్రమంలో రక్షణ రంగంపై మాట్లాడాల్సి వచ్చినప్పుడు సభకు కొద్దిసేపటి ముందు ఆయనకు ఫోన్ చేసినట్లు చెప్పారు. ఆ సమయంలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ 15 నిమిషాల్లోనే రక్షణ రంగంలో వచ్చిన మార్పులు, దేశీయ తయారీ, ఎగుమతులు, యుద్ధ విమానాల తయారీపై పూర్తి సమాచారం పంపించారని తెలిపారు. ఆ వివరాలను గుర్తుపెట్టుకొని నేను సభలో మాట్లాడాను. ప్రసంగం పూర్తయ్యాక రక్షణ రంగంపై నాకు ఎంతో పరిజ్ఞానం ఉందని అందరూ అభినందించారు. నిజానికి ఆ జ్ఞానం నాది కాదన్నా రు.
ఒకప్పుడు చిన్న రక్షణ పరికరాలను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న భారత్.. ఇప్పుడు యుద్ధ విమానాలు, క్షిపణులు, ఆధునిక రక్షణ సామగ్రిని స్వదేశంలో తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరిందన్నారు. ఈ మార్పులో సతీశ్‌రెడ్డి పాత్ర కీలకమని చెప్పారు.
కరోనా వేళ దేశానికి అండగా
కరోనా మహమ్మారి సమయంలో సతీశ్‌రెడ్డి నాయకత్వంలోని డీఆర్‌డీవో దేశానికి అండగా నిలిచిందని మంత్రి తెలిపారు. దేశంలో పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, వెంటిలేటర్లు అందుబాటులో లేని సమయంలో వాటిని స్వదేశంలోనే తయారు చేశారని గుర్తుచేశారు.
సతీశ్‌రెడ్డి శాస్త్రవేత్తగానే కాకుండా సామాజిక స్పృహ కలిగిన వ్యక్తని మంత్రి ప్రశంసించారు.
ఏపీ కోసం కృషి
పదవీ విరమణ అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారుగా రాష్ట్రానికి రక్షణ, వైమానిక రంగ పరిశ్రమలను తీసుకురావడానికి సతీశ్‌రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. పెట్టుబడులు తీసుకురావడంతోపాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఆయన సేవలు అభినందనీయమన్నారు.
శ్రోతగా పిలిచి వక్త ను చేశారు
బీవీ పట్టాభిరామ్ పేరుతో ఏర్పాటు చేసిన తొలి పురస్కారాన్ని సతీశ్‌రెడ్డికి, చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్న సభలో అందించడం ఎంతో ప్రత్యేకమన్నారు. కార్యక్రమానికి శ్రోతగా వచ్చిన తనను వేదికపైకి ఆహ్వానించి వక్త గా మాట్లాడే అవకాశం కల్పించిన ఎమెస్కో విజయకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News