-వేద విజ్ఞాన పరిషత్ డిమాండ్..
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యే సీటుతో పాటు రాష్ట్రంలోని బ్రాహ్మణుల ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతాల్లో రాజకీయ పార్టీలన్నీ బ్రాహ్మణ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని వేద విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన చర్చా వేదికలో తీర్మానించారు. తిరుపతిలోని అలిపిరి రోడ్డులో ఉన్న దివ్యరామం సమీపంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్టీఓ సుబ్రహ్మణ్యం, డాక్టర్ స్వరాజ్యలక్షి, డాక్టర్ అర్చన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వేద విజ్ఞానం, సనాతన ధర్మ పరిరక్షణకు ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, బ్రాహ్మణుల సంక్షేమం, వేద పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు. రాజకీయాల్లో బ్రాహ్మణులకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడంతో వారి సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. సమావేశంలో పాల్గొన్న పలువురు బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల నుంచి శాసనసభఎన్నికల వరకు బ్రాహ్మణులకు తగిన సంఖ్యలో టికెట్లు కేటా యించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. తిరుపతి ఎమ్మెల్యే స్థానాన్ని బ్రాహ్మణ అభ్యర్థికి ఇవ్వాలని, రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణుల ప్రాతినిథ్యం ఉన్న నియోజకవర్గాల్లో కూడా వారికి అవకాశం కల్పించాలని తీర్మానించారు. ఈ తీర్మానాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు, వివిధ రాజకీయ పార్టీలకు అందజేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో చిత్రపు రామకృష్ణ శేషగిరిరావు, చిత్రపు హనుమంతరావు, భాగవతుల జయలక్షి, వసంత్ కుమార్, ఆర్.వి. సత్యనారాయణ ప్రసాద్, శమంతక మణి, వేదం హరికృష్ణమోహన్, తురగా శ్రీరామ్ ఏనలిస్ట్, జర్నలిస్టు, కె. ఎస్.శర్మ, సుప్రీం కోర్టు, హైకోర్టు, అడ్వకేట్ చక్రవర్తుల రాఘవచారి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News