-రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే సంక్షేమం అందిస్తున్నాం
-మాటకు కట్టుబడి రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు పెన్షన్ పెంపు
-కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం
-నిరంతర విద్యుత్ తో పాటు ట్రూ డౌన్ ఘనత కూటమిదే
-ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవి
అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతి అని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకే ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం నిబద్ధత చాటుకుందని పేర్కొన్నారు. సామాజిక పింఛన్‌ను ఒకేసారి రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచి వృద్ధులు అండగా నిలిచిందన్నారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా చదువుకునే ప్రతి విద్యార్థికి రూ.13 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ‘స్త్రీ శక్తి’ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని అన్నారు. దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తూ మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. చేనేత కార్మికులు, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ అందిస్తూ వారి జీవనోపాధికి తోడ్పాటునిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అర్హులైన వారికి కొత్త పింఛన్లు, ఇళ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. సంక్షేమంతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేశామని చెప్పారు. 45 రోజుల పాటు నిర్వహించే ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జీలు, బూత్ కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా విద్యుత్ వినియోగదారులకు ట్రూ డౌన్ ప్రయోజనం కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ ఏడాది కూడా ట్రూ డౌన్ అమలుకు అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ స్తంభాల మార్పిడి, కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఈ ప్రభావం రాష్ట్రానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. రైతులు వాతావరణ పరిస్థితులను పరిశీలించి పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా ఏల్చూరు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో రూ.1.60 కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. అలాగే ఏల్చూరు-సజ్జాపురం మధ్య రూ.2.50 కోట్లతో నిర్మించిన బీటీ రహదారిని, రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రహదారులు, సైడ్ డ్రైన్లను ప్రజలకు అంకితం చేశారు. ఏల్చూరు ఎస్టీ కాలనీలో 93 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అర్హులైన మరో 30 మందికి కూడా త్వరలోనే ఇళ్ల పట్టాలు అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News