-హెచ్చరికలతోనే అప్రమత్తం కావాలి
-ఘటనా స్థలాలకు గంటల వ్యవధిలోనే చేరుకోవాలని బోధనాసుపత్రులకు డిఎంఈ ఆదేశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు(Disease Outbreaks and Epidemics) ప్రబలినప్పుడు ప్రజలకు వేగంగా వైద్యసేవలు అందించడంతోపాటు వ్యాధి వ్యాప్తిని తొలిదశలోనే అడ్డుకునేందుకు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డిఎంఈ) ముందస్తు చర్యలు చేపట్టింది. కమ్యూనిటీ మెడిసిన్, సూక్ష్మజీవశాస్త్రం, జనరల్ మెడిసిన్ నిపుణులతో రాష్ట్రస్థాయి సత్వర స్పందన బృందాన్ని(Rapid Response Teams) ఏర్పాటు చేసింది. దీనికనుగుణంగా ప్రతి బోధనాసుపత్రిలో ఇటువంటి బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. స్థానికంగా అంటువ్యాధుల ప్రభావం తీవ్రతను అనుసరించి సదరు ప్రాంతాలకు గంటల వ్యవధిలోనే ఈ బృందాలు చేరుకునే నిర్దిష్ట ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం ఉన్న విధానాన్ని పునస్సమీక్షించి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఎక్కడైనా వ్యాధి ప్రబలినట్లు సమాచారం అందితే సదరు బృందం రెండు నుంచి నాలుగు గంటల్లోగా అక్కడికి చేరుకుంటుంది. వ్యాధి సోకినవారిని గుర్తించడం, వ్యాప్తికి కారణాలను తెలుసుకోవడం, రోగులతో సన్నిహితంగా ఉన్నవారి వివరాలు సేకరించడం, నమూనాలను పరీక్షించడం వంటి చర్యలను వెంటనే చేపడుతుంది. కేసులు ఒక్కసారిగా పెరిగినా, ఒకే ప్రాంతంలో ఎక్కువ మంది అనారోగ్యానికి గురైనా తక్షణమే ఈ బృందం రంగంలోకి దిగుతుంది.
ఇందుకనుగుణంగా…
సంబంధిత ఆసుపత్రిలో 24 గంటలూ పనిచేసే నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి చికిత్స, మందులు, ఆక్సిజన్, పడకలు, రక్షణ పరికరాల లభ్యతను నిరంతరం పర్యవేక్షిస్తారు. తీవ్ర ఆనారోగ్యానికి గురైన రోగుల కోసం ప్రత్యేక వార్డులు, హెచ్‌డీయూలు, ఐసీయూలను సిద్ధం చేయనున్నారు. అన్ని ఆసుపత్రుల్లో ఒకే విధమైన చికిత్స అందేలా ప్రామాణిక వైద్య విధానాలను అమలు చేస్తారు. నమూనాల సేకరణకు అవసరమైన కిట్లు, క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రత్యేక వాహనాలను కూడా అందుబాటులో ఉంచుతారు.
స్పెషలిస్టు వైద్యుల్ని కూడా సిద్ధం చేయాలి
శ్వాసకోశ వ్యాధులు ప్రబలితే ఊపిరితిత్తుల వైద్యులు, పిల్లల్లో వ్యాధులు పెరిగితే చిన్నపిల్లల వైద్యులు, అత్యవసర చికిత్స అవసరమైనప్పుడు అనస్తీషియా, క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు వెంటనే సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిఎంఈ బోధనాసుపత్రులకు స్పష్టం చేసింది. అంటువ్యాధుల హెచ్చరికలు ఉన్న సమయంలో బృంద సభ్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని పేర్కొంది. ఈ కొత్త వ్యవస్థతో వ్యాధులను తొలిదశలోనే గుర్తించి, వేగంగా నియంత్రించడంతోపాటు బాధితులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించేందుకు మార్గం సుగమం అవుతుందని డిఎంఈ డాక్టర్ విష్ణువర్దన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News