Breaking News

పీహెచ్‌సీల పనితీరుకు ‘ఆరోగ్య ఫలితాలే’ ప్రామాణికం

-సేవల సంఖ్య ఆధారిత ర్యాంకుల విధానానికి స్వ‌స్తి
-మాతా శిశు ఆరోగ్యం నుంచి ప్రజల సంతృప్తి వరకు 21 అంశాల ప‌నితీరు ఆధారంగా మార్కులు
-మాతృత్వ మరణాలు, సిజేరియన్లు తగ్గిన ఆసుపత్రులకు ర్యాంకింగ్ లో ప్రాధాన్యం
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) పనితీరు మదింపులో కూటమి ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఎంతమంది రోగులకు సేవలందించారు? ఎన్ని పరీక్షలు చేశారు? ఎన్ని ప్రసవాలు నిర్వహించారు? అనే లెక్కలను మాత్రమే కాకుండా… అందించిన వైద్య సేవల వల్ల ప్రజల ఆరోగ్యంలో ఎంత మార్పు వచ్చింది? మాతా శిశు మరణాలు తగ్గాయా? రక్తపోటు, మధుమేహ రోగులకు నిరంతర చికిత్స అందుతోందా? లేదా? సేవలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? అనే ఫలితాల ఆధారంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును గుర్తించనున్నారు.
ఇందుకోసం మొత్తం 21 కీలక పనితీరు సూచికలతో (Kee Performing Indicators) కొత్త ర్యాంకింగ్, గ్రేడింగ్ విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. ‘సంజీవని’, ‘మాతృత్వ’, ‘క్షేమ’ కార్యక్రమాలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును అనుసంధానిస్తూ… గ్రామస్థాయి వైద్య వ్యవస్థను మరింత జవాబుదారీగా, ఫలితాల ఆధారితంగా, ప్రజలకు చేరువగా తీర్చిదిద్దడమే ఈ కొత్త ర్యాంకింగ్ విధానం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ నేడు ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఐదు అంశాల పరిమితికి స్వస్తి

ప్రస్తుతం 5 అంశాల ఆధారంగానే వైద్యారోగ్య శాఖ ర్యాంకులను ప్రకటిస్తోంది. ఓపీ (OP) విధానంలో రోగుల సంఖ్య, ఆసుపత్రిలో చేరినవారు, ల్యాబ్ పరీక్షలు, ప్రసవాలు, గర్భనిరోధక సాధనాల వాడకం వంటి ఐదు అంశాల ఆధారంగానే పీహెచ్‌సీల పనితీరును అంచనా వేసేవారు. ఈ విధానంలో సేవల సంఖ్య మాత్రమే తెలుస్తోందని… వ్యాధుల నివారణలో సాధించిన పురోగతి, మాతా శిశు ఆరోగ్య ఫలితాలు, దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, రోగులకు నిరంతర చికిత్స వంటి కీలక అంశాలు ప్రతిబింబించడం లేదని అధికారుల పునస్సమీక్షలో తేలింది. ఈ విధానం అమలు, ఫలితాలపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ జారీ చేసిన ఆదేశాల మేరకు అధికారులు పునస్సమీక్ష జరిపారు. సేవలు మెరుగుపడాలంటే 21 కొలమానాల ఆధారంగా ర్యాంకులను ప్రకటించాల్సిన అవసరం ఉందని మంత్రికి నివేదించారు. వీటికి మంత్రి ఆమోదం తెలుపుతూ… గ్రామీణులకు వైద్య సేవలు అందించడంలో కీలకంగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు ఈ కొత్త ర్యాంకింగ్ విధానంతో మరింత మెరుగుపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేవలం సేవల సంఖ్యనే కాకుండా, వాటివల్ల ప్రజలకు కలిగిన ఆరోగ్య ప్రయోజనాలకు గుర్తింపునిస్తూ కొత్త ర్యాంకింగ్ విధానాన్ని రూపొందించారు.

21 రకాల సూచికల్లో ప్రధానoగా

మాతృత్వ మరణాలు, సిజేరియన్లు తగ్గితేనే మెరుగైన ర్యాంకు

సదరు పీహెచ్సీ ల పరిధిలో నమోదయ్యే టీనేజ్‌ గర్భధారణలు, హైరిస్క్ గర్భిణుల నమోదు, గర్భధారణ కాలంలో అందించే వైద్య సేవలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు, సిజేరియన్ ప్రసవాల శాతం, మొత్తం సంతానోత్పత్తి రేటు, మాతృ మరణాల నియంత్రణను పరిగణనలోకి తీసుకోనున్నారు. కొత్త ర్యాంకింగ్‌లో ఇవి అత్యంత కీలకం కానున్నాయి.

.
పిల్లలకు పరీక్షలతో సరిపెట్టకుండా… చికిత్స పూర్తి వరకు పర్యవేక్షణ

శిశు మరణాలు, తక్కువ బరువుతో జన్మించిన పిల్లలు, ఏడాదిలోపు శిశువులకు పూర్తిస్థాయిలో టీకాలు, పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు, పోషకాహార లోపాలు, వ్యాధులు, ఎదుగుదలలో ఆలస్యాన్ని గుర్తించే పరీక్షలను కొత్త విధానంలో చేర్చారు. ఆరోగ్య సమస్యలున్న పిల్లలను గుర్తించి ఉన్నత వైద్య కేంద్రాలకు పంపించడంతోనే అధికారుల బాధ్యత ముగియదు. వైద్యాధికారి సూచించిన పిల్లలకు వాస్తవంగా చికిత్స అందిందా? లేదా? అన్న అంశాన్నీ పరిశీలిస్తారు. దీనివల్ల పరీక్షల దశ నుంచి చికిత్స పూర్తయ్యే వరకు ప్రతి దశలోనూ పిల్లల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు వీలవుతుంది.

మధుమేహం, రక్తపోటు రోగులపై నిరంతర నిఘా

అసంక్రమిత వ్యాధుల (NCDs) నియంత్రణకు కొత్త విధానంలో ప్రాధాన్యం ఇచ్చారు. అర్హులైన ప్రజల్లో రక్తపోటు (BP), మధుమేహం (Diabetes), సాధారణ క్యాన్సర్ల పరీక్షలు ఎంతవరకు పూర్తయ్యాయి? వ్యాధి నిర్ధారణ అయిన వారికి క్రమం తప్పకుండా మందులు అందుతున్నాయా? వైద్య పరీక్షలు జ‌రుగుతున్నాయా? అనే అంశాలను మదింపు చేస్తారు. క్యాన్సర్ అనుమానితులను గుర్తించి సకాలంలో ఉన్నత వైద్య కేంద్రాలకు పంపించడాన్ని కూడా పనితీరు సూచికగా చేర్చారు. దీంతో వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించే అవకాశాలు పెరగనున్నాయి.

ప్రజాభిప్రాయానికీ మార్కులు

పీహెచ్‌సీల్లో వైద్య సేవలు పొందిన ప్రజలు ఐవీఆర్‌ఎస్ (RTGS) ద్వారా తెలియజేసే అభిప్రాయాన్ని కూడా ర్యాంకింగ్‌లో భాగం చేశారు. వైద్యులు, సిబ్బంది ప్రవర్తన, ఆసుపత్రి పరిశుభ్రత, వేచి ఉండే సమయం, మందుల లభ్యత, రోగులకు ఇచ్చే గౌరవం వంటి అంశాలు ర్యాంకింగ్‌ను నిర్ణయించడంలో కీలకం కానున్నాయి.

21 పాయింట్లు.. 4 గ్రేడ్లు

మొత్తం 21 కీలక పనితీరు సూచికల్లో ఒక్కో అంశానికి గరిష్ఠంగా ఒక పాయింట్ కేటాయిస్తారు. సాధించిన మొత్తం స్కోరును శాతంగా మారుస్తారు. లక్ష్యాన్ని ఎక్కువగా సాధించాల్సిన అంశాల్లో మెరుగైన ఫలితాలకు అధిక స్కోరు ఇస్తారు. మాతృ మరణాలు, శిశు మరణాలు, టీనేజ్‌ గర్భధారణలు, సిజేరియన్ ప్రసవాల వంటివి తక్కువగా నమోదైన కేంద్రాలకు మెరుగైన స్కోరు లభిస్తుంది.

గ్రేడింగ్ విధానం

* ‘A’ గ్రేడ్: 80% నుంచి 100%
* ‘B’ గ్రేడ్: 70% నుంచి 80% లోపు
* ‘C’ గ్రేడ్: 60% నుంచి 70% లోపు
* ‘D’ గ్రేడ్: 60% కంటే తక్కువ

ర్యాంకులతో ప్రయోజనాలు

“నెలనెలా ర్యాంకులు ప్రకటించడం ద్వారా వెనుకబడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వెంటనే గుర్తించి లోపాలను సరిదిద్దుతాం. ఈ కొత్త ర్యాంకింగ్ విధానాన్ని అమలు ప్రక్రియను ప్రారంభించాం” అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి & ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి.వీరపాండియన్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *