Breaking News

హంద్రీనీవాతో కుప్పానికి జలకళ

-కుప్పంలో పర్యాటకరంగ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేకదృష్టి
-స్థానికంగా పరిశ్రమల రాకతో వేలాదిమందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు
-మహిళలు ధైర్యంగా ముందడుగు వేయాలి- ఆర్థిక శక్తిగా ఎదగాలి
-కుప్పం నియెజకవర్గంలో నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటన ప్రారంభం

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి, ప్రజలకు సంక్షేమం అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గానికి పెద్ద ఎత్తున పరిశ్రమల రాకతో ఉపాది, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. హంద్రీనీవాతో కుప్పం ప్రజల దశాబ్ధాల కల నెరవేరిందన్నారు. మహిళలు ధైర్యంగా ముందడుగు వేసి ఆర్థిక ప్రగతి సాధించాలన్నారు. కుప్పం నియెజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు రామకుప్పం మండలంలో పలు తాండల్లో పర్యటించిన నారా భువనేశ్వరి మహిళలతో సమావేశమయ్యారు.

కుప్పంలో టూరిజం అభివృద్ధికి చర్యలు

ముందుగా రామకుప్పం మండలం నారాయణపురం తాండ, ననియాల తాండ మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…నిజం గెలవాలి యాత్ర సమయంలో కుప్పం ప్రజలు నాపై చూపించిన అభిమానాన్ని జీవితంలో మర్చిపోలేను. సీఎం చంద్రబాబును 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కుప్పం ప్రజలకు మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. బాధ్యత కలిగిన ఒక కార్యకర్తగా నేను ఇక్కడికి వచ్చాను. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బిజీగా ఉండటంతో కుప్పం ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి వచ్చాను. మన రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. కుప్పంలో టూరిజం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. టూరిజం అభివృద్ధి ద్వారా మన స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. కుప్పంలో ఎకో టూరిజం అభివృద్ధికి చంద్రబాబు రూ.7 కోట్లు కేటాయించారు. పర్యాటకం కోసం ప్రభుత్వం రూ.3.5 కోట్లు ఖర్చుచేసింది. స్థానికంగా పది ఎకరాల్లో జింకల పార్కు రాబోతోంది. జంగిల్ హట్ రిసార్ట్, చిన్నారులకు ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేయబోతున్నారని నారా భువనేశ్వరి తెలిపారు.

హంద్రీనీవాతో కుప్పానికి కృష్ణాజలాలు

హంద్రీనీవా ద్వారా కుప్పానికి చంద్రబాబు కృష్ణా జలాలు తీసుకొచ్చారు. దీని వల్ల 6 వేల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ప్రస్తుతం 110 చెరువులు నింపారు. రానున్న రోజుల్లో అన్నీ చెరువులకూ కృష్ణా నీళ్లు చేరతాయి. ననియాల పంచాయతీ పరిధిలో రూ.20 లక్షలతో రహదారులు, రూ.40 లక్షలతో పంచాయతీ భవనం నిర్మించారు. రూ.32 లక్షల వ్యయంతో ఆస్పత్రిని ఆధునీకరించారు. పీ4 కింద పేదలను ఆదుకుంటున్నారు. ఒక్కో ఆటో డ్రైవర్‌కు రూ.లక్ష చొప్పున 10 మందికి రూ.10 లక్షల ఆర్థిక సాయం పీ4 ద్వారా అందింది. తాండలో 153 మందికి పింఛను అందుతోంది. తల్లికి వందనం పథకం కింద 144 మందికి రూ.21 లక్షలు జమ చేశారు. రామాపురం తాండ, విరియాల తాండలో వాటర్ ట్యాంకర్ల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి సౌకర్యం, వీధి లైట్ల ఏర్పాటు, గోకులం షెడ్ల మంజూరు, రామాపురం తాండలో చెక్ డ్యామ్ ఏర్పాటు చేయాలని కోరారని నారా భువనేశ్వరి తెలిపారు.

మహిళలు ధైర్యంగా ముందడుగేయాలి

రామకుప్పం మండలం, పీఎంకే తాండ మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రామకుప్పం మండలంలోని తాండాల్లో తెలుగు దేశం జెండా ఎగిరింది. చంద్రబాబు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కుప్పం ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు. సీఎం చంద్రబాబు కుప్పానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. నియెజకవర్గానికి ఒకేసారి 30 పరిశ్రమలు తెచ్చారు. ఈ పరిశ్రమల ద్వారా వేలాదిమందికి ఉపాధి, ఉద్యోగా అవకాశాలు లభిస్తాయి. మహిళలు ఇంటికే పరిమితం కాకూడదు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ద్వారా మహిళలు శిక్షణ తీసుకుని ఉపాధి అవకాశాలు పొందాలి. ఒకప్పుడు బిజినెస్ అంటే నాకూ తెలీదు. ధైర్యంగా ముందుడుగు వేస్తేనే ఏదైనా సాధించగలం. గతంలో మన కుప్పానికి నీటి ఎద్దడి ఎక్కువగా ఉండేది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హంద్రీనీవా ద్వారా కుప్పానికి కృష్ణాజలాలు తీసుకొచ్చి దశాబ్ధాల కల నెరవేర్చారు. నదుల అనుసంధానంతో సాగు, తాగు నీరు అందిస్తున్నారని నారా భువనేశ్వరి చెప్పారు.

గత పాలనలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛా లేదు

గత ప్రభుత్వంలో రాష్ట్రంలో పాలన ఎలా ఉందో అందరూ చూశారు. స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితులు కూడా లేవు. చంద్రబాబు సుపరిపాలన అందిస్తారనే నమ్మకంతో కూటమిని ప్రజలు గెలిపించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే ఎన్టీఆర్ భరోసా, దీపం పథకం, తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ, స్త్రీ శక్తి , అన్నా క్యాంటీన్లను విజయవంతంగా అమలు చేస్తోంది. పీఎంకే తాండాలో అర్హులందరికీ సంక్షేమం అందుతోంది. పంచాయతీ పరిధిలో రూ. 75 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, రూ.30 లక్షల వ్యయంతో రహదారుల నిర్మాణం చేపట్టారు. రూ.3 లక్షల వ్యయంతో 3 బోర్లు మరమ్మతులు చేశారు. కమ్యూనిటీ భవనం నిర్మించారు. ఈ తాండలో గోకులం షెడ్లు నిర్మించేందుకు రూ. 25 లక్షలు మంజూరు చేశారు. రూ.25 లక్షలతో ఓం శక్తి దేవాలయాన్ని అభివృద్ధి చేశారని నారా భువనేశ్వరి తెలిపారు.

నిత్యం ప్రజలకు మేలు చేయాలనే తపన

రామకుప్పం మండలం పండ్యాలమడుగులో మహిళలతో నారా భువనేశ్వరి సమావేశమయ్యారు. ప్రజలే తన కుటుంబంగా సీఎం చంద్రబాబు భావిస్తారు. నిత్యం ప్రజలకు మంచి చేయాలనే ఆలోచిస్తారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ఇచ్చిన ఐటీ పిలుపుతో ప్రపంచమంతా మన తెలుగువారు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తెస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే సూపర్ సిక్స్ అమలు చేస్తున్నారు. పేదలకు రూ.5కే కడుపు నిండా భోజనం అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో మాట్లాడాలంటేనే ప్రజలు భయపడేవారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. కుప్పం నియోజకవర్గంలో ఎకో టూరిజం అభివృద్ధి జరుగుతోంది. టూరిజం అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. హంద్రీనీవాతో కుప్పం నియోజకవర్గంలో నీటి కష్టాలు తీర్చారు. ఈ గ్రామంలో 450 మందికి తల్లికి వందనం, 492 మందికి పింఛన్లు , 493 మందికి అన్నదాత సుఖీభవ పథకాల లబ్ధి అందుతోంది. మహిళతో ఆర్థికంగా బలంగా ఉండాలి. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మహిళలకు నైపుణ్యంలో శిక్షణ అందిస్తున్నామని నారా భువనేశ్వరి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *