-మళ్లీ ఆరెస్సెస్ వ్యక్తికే కేంద్ర విద్యాశాఖ పగ్గాలా?
-ఎన్‌టీఏ, ఎన్ ఈపీని రద్దు వరకు ఉద్యమం
-విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి
-కాక్రోచ్ ఆందోళనలకు సీపీఐ సంపూర్ణ మద్దతు
-బొద్దింకలకు భయపడుతున్న మోదీ, అమిత్‌షా
-ఏపీలో తీవ్రమైన కరువు పరిస్థితులు
-కరువు తీవ్రతపై సీఎం చంద్రబాబు స్పందించాలి
-సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాతయినా బుద్ధి రాలేదని, రాజీనామా చేసిన ఎంపీని పార్లమెంట్‌లో బీజేపీ సన్మానించడం సిగ్గుచేటని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
విజయవాడ దాసరి భవన్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. విద్యార్థి ఉద్యమాల ఒత్తిడి, దేశవ్యాప్తంగా కొనసాగిన 49 రోజుల నిరసనలు, అనేక ప్రాంతాల్లో జరిగిన పోలీసు లాఠీచార్జీలు, బలప్రయోగం అనంతరమే కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన గుర్తుచేశారు. అయితే రాజీనామా చేసిన మంత్రిని పార్లమెంట్‌లో సత్కరించడం సిగ్గుమాలిన చర్యని తూర్పారబట్టారు. ఇది విద్యార్థుల త్యాగాలను, వారి ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం అవమానించడమేనని అన్నారు.
ఇంతకుముందు ఏబీవీపీగా చేసిన వారికి, ఇప్పుడు ఆరెస్సెస్‌గా పని చేసిన వారికే తిరిగి విద్యామంత్రి పీఠం కట్టబెట్టడం దుర్మార్గమని అన్నారు. మతం రంగు పులిమి విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారని, కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. కేంద్ర విద్యా శాఖమంత్రిగా ఎన్డీఏలోని లౌకికవాద వ్యక్తిని ఎందుకు నియమించలేదని సూటిగా ప్రశ్నించారు. విద్యార్థిని కాల్చాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యమించారని, వారిపై నమోదు చేసిన కేసులు ఇంకా తొలగించలేదని, తక్షణమే కేసులను రద్దు చేయాలన్నారు. విద్యార్థి ఉద్యమాల సందర్భంగా దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ఉపసంహరిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. కేసులను తక్షణమే ఉపసంహరించి విద్యార్థులపై ఉన్న అన్ని వేధింపులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీలను అమలు చేయకపోతే విద్యార్థి సంఘాలు తమ ఆందోళనలను మరింత విస్తృత స్థాయిలో కొనసాగిస్తాయని హెచ్చరించారు.
విద్యార్థుల సమస్యలకు ప్రధాన కారణంగా మారిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ను వెంటనే రద్దు చేయాలని, జాతీయ విద్యా విధానం-2020 (ఎన్ ఈపీ-2020)ను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ విధానం ప్రభుత్వ విద్యను బలహీనపరచి విద్యను కార్పొరేటీకరణ, వాణిజ్యీకరణ, కాషాయీకరణ దిశగా నడిపిస్తోందని విమర్శించారు. ఎన్‌టీఏ రద్దు, జాతీయ విద్యా విధానం ఉపసంహరణ జరిగే వరకు విద్యార్థి సంఘాలు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తాయని స్పష్టం చేశారు.
గత 12 ఏళ్లుగా ప్రధాని మోదీ, అమిత్‌షా అన్ని పార్టీలను, చివరకు ముఖ్యమంత్రులను సైతం బెదిరించారని, ఇవాళ బొద్దింకలకు భయపడే పరిస్థితి మోడీ, అమిత్ షాలకు దాపురించిందని ఎద్దేవా చేశారు.
పార్టీ నిర్మాణంపైనే సీఎం చంద్రబాబు దృష్టి పెడుతూ, ఇంటి ఇంటికి టీడీపీ అంటూ తిరుగుతున్నారని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపైనా సీఎం స్పందించాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులపై రామకృష్ణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో దశాబ్దాలుగా చూడని స్థాయిలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. రాష్ట్రంలో వర్షపాతం లోటు సుమారు 54 శాతం నమోదైందని, ప్రభుత్వ గణాంకాల ప్రకారం 28 జిల్లాల్లో 21 జిల్లాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని వివరించారు. 608 మండలాల్లో వర్షపాతం లోటు నమోదవ్వగా, వాటిలో 249 మండలాలు తీవ్రమైన కరువు ప్రభావిత ప్రాంతాలుగా మారాయని తెలిపారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విస్తారమైన భూములు బీడుగా మారాయని, ఇప్పటికే సాగు చేసిన పంటలు వర్షాభావంతో ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30.80 లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 16.40 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయని వివరించారు. దాదాపు సగం వ్యవసాయ భూములు సాగుకు దూరమయ్యాయని తెలిపారు. రాష్ట్ర కరువు పరిస్థితులపై సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం సమర్పిస్తామని రామకృష్ణ వెల్లడించారు. వర్షాలు ఆలస్యమైతే రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయశాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని, అవసరమైన విత్తనాలు, ఎరువులను ఉచితంగా అందించాలని, కరువు నివారణ చర్యల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వెంటనే అప్రమత్తం చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ కార్యక్రమాల కంటే రైతుల రక్షణ, కరువు నివారణ చర్యలకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు నిర్మాణాత్మక సహకారం అందించాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News