– డా. బీఆర్ అంబేద్కర్ స్మృతి వనం, కళావేదికను సందర్శించిన మేయర్, కార్పొరేటర్లు
– ప్రాజెక్టు నిర్మాణ విశిష్టతను వివరించిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహారాష్ట్ర రాష్ట్రంలోని లాతూర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన మేయర్ బాలచంద్ర కంబుల్, కార్పొరేటర్లు, అధికారుల బృందం మంగళవారం విజయవాడలోని డా. బీఆర్ అంబేద్కర్ స్మృతి వనం, అంబేద్కర్ కళావేదికను విజ్ఞాన యాత్రలో భాగంగా సందర్శించింది.
ఈ సందర్భంగా బందర్ రోడ్–ఎంజీ రోడ్ కూడలిలోని డా. బీఆర్ అంబేద్కర్ స్మృతి వనంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 210 అడుగుల విగ్రహాన్ని సందర్శించిన ప్రతినిధి బృందం, అక్కడి అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించింది. ఎక్స్‌పీరియన్స్ థియేటర్, సుందరమైన గ్రీనరీ, బ్యూటిఫికేషన్, ఫౌంటెన్లు, డాక్టర్ అంబేద్కర్ జీవిత విశేషాలను ప్రతిబింబించే మ్యూరల్ ఆర్ట్స్, సెమినార్ హాల్, డిజిటల్ ప్రదర్శనలు, ఆయన జీవిత చరిత్రను వివరిస్తున్న ప్రత్యేక ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు. విగ్రహ నిర్మాణంలో వినియోగించిన సాంకేతికతకు సంబంధించిన వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అంబేద్కర్ కళావేదికను సందర్శించిన బృందం గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలు, కళా ప్రదర్శనలు, నిర్మాణ వైశిష్ట్యాన్ని పరిశీలించింది. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అంబేద్కర్ స్మృతి వనం, కళావేదిక నిర్మాణ విశిష్టత, సాంకేతిక అంశాలు, ప్రజలకు అందిస్తున్న సాంస్కృతిక, విద్యా ప్రయోజనాలపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ, విజయవాడ నగరం ఆధునిక అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. దేశంలోని అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అంబేద్కర్ స్మృతి వనాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. అలాగే ఇటీవల నిర్మించిన అంబేద్కర్ కళావేదికలో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, చరిత్ర, కళాత్మక వైభవాన్ని ప్రతిబింబించే విశిష్ట ప్రదర్శనలు ఏర్పాటు చేశామని వివరించారు.
కలెక్టర్ ప్రజెంటేషన్ అనంతరం లాతూర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బాలచంద్ర కంబుల్ మాట్లాడుతూ, తమకు విజయవాడలో లభించిన ఆతిథ్యం అమూల్యమైనదని పేర్కొన్నారు. అంబేద్కర్ స్మృతి వనం, అంబేద్కర్ కళావేదిక అత్యంత సాంకేతిక ప్రమాణాలతో అభివృద్ధి చేయడం ప్రశంసనీయమని కొనియాడారు. భవిష్యత్తులో లాతూర్‌లో అంబేద్కర్ విగ్రహ నిర్మాణం చేపట్టే సమయంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశను ప్రత్యేకంగా ఆహ్వానించి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
అనంతరం కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ.. లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్ల బృందానికి అంబేద్కర్ విగ్రహ ప్రతిరూపాన్ని జ్ఞాపికగా అందజేశారు. మరో జ్ఞాపికను లాతూర్ మున్సిపల్ కమిషనర్‌కు అందజేయాలని బృందానికి అందించారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్ ఎ.రవీంద్రరావు, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, ఎస్టేట్ ఆఫీసర్ ఎస్.శ్రీధర్, ఇన్‌చార్జి జిల్లా అగ్నిమాపక అధికారి నరేష్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కె బాబ్జి, డి జడ్ యం జి.జ్యోతి, డి జడ్ యం ఎలక్ట్రికల్ యం. దొరబాబు, మేనేజర్ టెక్నికల్ ఇస్మాయిల్ బేజ్, డిప్యూటీ జోనల్ మేనేజర్ రహీం, కల్చరల్ డిపార్ట్మెంట్ మేనేజర్ యం సుమన్, కేపీసీ డైరెక్టర్ వాసు, శిల్పి ప్రసాద్, లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ విజయ్‌కుమార్, స్టాండింగ్ కమిటీ ఛైర్మన్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News