-నగరంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై ఆకస్మిక తనిఖీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ రీజినల్ ఫైర్ ఆఫీసర్ రత్నబాబు ఆధ్వర్యంలో నగరంలోని షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాలు, కార్యాలయ భవనాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, హోటళ్లు మరియు ప్రజలు అధికంగా సందర్శించే ఇతర భవనాల్లో ఆకస్మిక అగ్నిమాపక భద్రతా తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం ఎం.జి రోడ్లో గల చెన్నై షాపింగ్ మాల్ లో వియంసి ఫైర్ సిబ్బంది ఆకస్మికతనికి నిర్వహించారు.
తనిఖీల సందర్భంగా భవనాల్లో ఏర్పాటు చేసిన అగ్నిమాపక పరికరాలు, ఫైర్ అలారం వ్యవస్థలు, స్మోక్ డిటెక్టర్లు, స్ప్రింక్లర్ వ్యవస్థలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, ఎగ్జిట్ సూచిక బోర్డులు, విద్యుత్ భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా రీజినల్ ఫైర్ ఆఫీసర్ రత్నబాబు మాట్లాడుతూ, ప్రజల రక్షణ దృష్ట్యా ప్రతి భవన యాజమాన్యం అగ్నిమాపక భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అగ్నిమాపక పరికరాలను ఎల్లప్పుడూ వినియోగానికి సిద్ధంగా ఉంచడంతో పాటు, అత్యవసర నిష్క్రమణ మార్గాలను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వహించాలని తెలిపారు. అలాగే ఫైర్ సేఫ్టీ పరికరాల నిర్వహణను కాలానుగుణంగా చేపట్టి, సిబ్బందికి అగ్నిమాపక భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.
తనిఖీలలో గుర్తించిన లోపాలను సంబంధిత యాజమాన్యాల దృష్టికి తీసుకువెళ్లి, తక్షణమే సరిదిద్దాలని ఆదేశించినట్లు తెలిపారు. భద్రతా నిబంధనలను పాటించని యాజమాన్యాలపై అమలులో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతను దృష్టిలో ఉంచుకుని నగరవ్యాప్తంగా అగ్నిమాపక భద్రతా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ప్రతి సంస్థ అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని రీజినల్ ఫైర్ ఆఫీసర్ రత్నబాబు కోరారు.
ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, వీఎంసీ ఫైర్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News