Breaking News

నగరవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై ఆకస్మిక ప్రత్యేక తనిఖీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఇంచార్జి డాక్టర్ గోపాల్ నాయక్ తెలిపారు. మంగళవారం నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో ఆకస్మిక ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. సర్కిల్ కి 18, మొత్తం 48 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మార్కెట్లు, హోల్‌సేల్ దుకాణాలు, రిటైల్ షాపులు, సూపర్ మార్కెట్లు, వాణిజ్య సంస్థలు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో మొత్తం 640.9 కేజీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై రూ 5,56,350 విధించినట్లు వెల్లడించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను విక్రయించడం, నిల్వ చేయడం లేదా వినియోగించడం చట్టవిరుద్ధమని, ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలతో పాటు అవసరమైతే ట్రేడ్ లైసెన్సులు కూడా రద్దు చేసే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తాయని, డ్రైనేజీ వ్యవస్థలు మూసుకుపోవడానికి, భూకాలుష్యం పెరగడానికి ప్రధాన కారణమవుతున్నాయని తెలిపారు. అందువల్ల వ్యాపారులు, ప్రజలు గుడ్డ సంచులు, జ్యూట్ బ్యాగులు, పేపర్ కవర్లు వంటి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచించారు. నగరాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇటువంటి ఆకస్మిక ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో మూడు సర్కిళ్లకు చెందిన శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, శానిటేషన్ సెక్రటరీలు మరియు పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *