-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-కరోనా కంటే ప్రమాదకరంగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితులు
-రాబోయే 4 నెలలు చాలా కీలకం
-కరువు తీవ్రతపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిచండి
-చిరుధాన్యాలు సాగుపై రైతులు దృష్టి సారించాలి
-వీబీ జీ రామ్ జీ తో ఉపాధి, మౌలిక సదుపాయల కల్పన
-నీరులేని చెరువుల్లో పశుగ్రాసం పెంచుదాం
-పొలం కుంటల నిర్మాణానికి 50 శాతం రాయితీ
-వివిధ శాఖల సమీక్షా సమావేశంలో మంత్రి సవిత
పెనుకొండ/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా కంటే ప్రమాదకమైన ఎల్ నినో వర్షాభావ పరిస్థితులను వీబీ జీ రామ్ జీ పథకంతో ధీటుగా ఎదుర్కొందామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత దిశా నిర్దేశం చేశారు. రాబోయే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నీటి ఆధారమైన పంటలకు బదులు చిరుధాన్యాల సాగును రైతులు చేపట్టాలని సూచించారు. జల జీవన్ మిషన్ కింద రూ.11.50 కోట్లు మంజూరయ్యాయని, ఆ నిధులతో తాగునీటి కల్పనకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎల్ నినోను అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో ఎల్ నినోపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పెనుకొండ ఆర్డీవో కార్యాలయంలో ఎల్ నినో – వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోవడంపై వ్యవసాయ, రెవెన్యూ, హార్టీకల్చర్, గ్రామీణాభివృద్ధి శాఖాధికారులతో మంత్రి సవిత మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్ నినో కారణంగా 140 దేశాల్లో కరవు ప్రబలే ప్రమాదముందని తెలిపారు. భారతదేశం విషయానికొస్తే దక్షి భారతంలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. అందులోనూ ఉమ్మడి అనంతపురంలో కరువు మరింత తీవ్రంగా ఉండే అవకాశముందన్నారు. సాగు, తాగునీటి కష్టాల నుంచి గట్టెక్కేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫామ్ పాండ్స్(పొలం కుంటలు) నిర్మాణానికి హార్టీకల్చర్ ద్వారా 50 శాతం రాయితీ అందిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ప్రతి వర్షపు నీటితో పాటు వృథాగా పోయే నీటిని ఈ కుంటల్లోకి మళ్లించడం ద్వారా భూగర్భ జలాల మట్టం పెంచడంతో పాటు సాగు నీటిని సంరక్షించుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఒక్కో ఫాం పాండ్ నిర్మాణానికి రూ.1.80 లక్షలు వ్యయం కాగా, ప్రభుత్వం రూ.90 వేలు రాయితీ అందిస్తుందని మంత్రి సవిత తెలిపారు.
చిరు ధాన్యాలు సాగు చేద్డాం
ఎల్ నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు రైతులు గట్టెక్కాల తక్కువ నీటి ఆధారిత పంటలు సాగు చేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. ప్రస్తుతం వర్షాలు కురిసినా, రాబోయే నాలుగు నెలలు తీవ్ర ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందన్నారు. చిరు ధాన్యాల సాగుకు తక్కువ నీరు అవసరమవుతుందని, ఈ దిశగా రైతులు
ఆలోచించాలని సూచించారు. ఎల్ నినోపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కరోనా కంటే తీవ్ర నష్టాన్ని ఎల్ నినో కలిగించనున్నట్లు అధికారులువెల్లడించారు. 140 దేశాల్లో ఎల్ నినో ప్రభావం ఉందని మంత్రి సవిత తెలిపారు.
చెరువుల్లో పశుగ్రాసం సాగు
ఎల్ నినో ప్రభావం పశువులపైనా ఉండబోతోందని మంత్రి సవిత తెలిపారు. వర్షాలు కురవక పోవడం వల్ల నీటి ఎద్దడి తలెత్తుతుందన్నారు. పంటలు దెబ్బతినడంతో పశు గ్రాసం కొతర ఏర్పడుతుందన్నారు. ఈ విపత్తు నుంచి పశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నియోజక వర్గం వ్యాప్తంగా ఉన్న చెరువులను గుర్తించి, నీరు లేని చోట పశు గ్రాసం పెంచడానికి చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖాధికారులకు మంత్రి ఆదేశించారు. సాగు చేసిన పశు గ్రాసాన్ని రైతులకు అందజేయాలని స్పష్టంచేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందు చూపుతో నిర్మించిన నీటి తొట్టెలు ఎంతగానో ఉపయోగపడనున్నాయన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు నీటి తొట్టెలను నింపి, పశువుల దాహాన్ని తీర్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత ఆదేశించారు.
వీబీ జీ రామ్ జీతో వలసలకు బ్రేక్
జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో ఏర్పాటు చేసిన వీబీ జీ రామ్ జీ పథకంతో ఎల్ నినో కరువు పరిస్థితులు ధీటుగా ఎదుర్కొందామని మంత్రి సవిత పిలుపునిచ్చారు. వీబీ జీ రామ్ జీ పథకంలో పని దినాలు పెంచారన్నారు. దీనివల్ల వలసలకు అడ్డుకట్ట వేయొచ్చునన్నారు. అదే సమయంలో గ్రామాల్లో రోడ్లు, డ్రైనీజీలు, సాగునీటి కాలువ నిర్మాణాలు కూడా చేపటొచ్చునన్నారు. జల జీవన్ మిషన్ కింద రూ.11.50 కోట్లు మంజూరయ్యాయని, ఆ నిధులతో తాగునీటి కల్పనకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ ఐక్యంగా, సమన్వయం చేసుకుంటూ ఎల్ నినో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొందామని మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆనందరావు, వ్యవసాయం, రెవెన్యూ, హార్టీకల్చర్, గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News