Breaking News

విద్యుత్ సేవల్లో రాజీ వద్దు

-పనులు వేగవంతం చేయండి
-ప్రజా సంతృప్తే ప్రామాణికం
-ఫిర్యాదులకు తావివ్వొద్దు.
-విజయనగరం జిల్లా అధికారుల సమీక్షలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి

విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ శాఖ పనితీరుపై ప్రజల్లో నమ్మకం మరింత పెరగాలని, విద్యుత్ సేవల విషయంలో ఫిర్యాదులకు తావులేకుండా అధికారులు పనిచేయాలని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. జిల్లాలో కొనసాగుతున్న విద్యుత్ అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన అభివృద్ధి పనుల పురోగతిని సమగ్రంగా పరిశీలించారు. జిల్లాలో విద్యుత్ మౌలిక సదుపాయాల బలోపేతానికి చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల అమలు తీరుపై ఆరా తీశారు. కొత్త సబ్‌స్టేషన్లు, ఫీడర్ల విస్తరణ, ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్య పెంపు, విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ వంటి పనులు ఎక్కడివరకు వచ్చాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే మంజూరైన పనులు ఆలస్యం కాకుండా కాంట్రాక్టర్లతో సమన్వయం పెంచి వేగంగా పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో లో ఓల్టేజ్, తరచు విద్యుత్ అంతరాయాల సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. సమస్యలు వచ్చిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

“విద్యుత్ శాఖపై ప్రజల నుంచి ఫిర్యాదులు రావొద్దు.. వచ్చినా వెంటనే పరిష్కారం కనిపించాలి. వినియోగదారుల సంతృప్తి స్థాయే శాఖ పనితీరుకు కొలమానం కావాలి” అని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదుల పరిష్కారంలో వేగం పెంచడం, సేవల నాణ్యతను మెరుగు పరచడం ద్వారా శాఖపై విశ్వాసాన్ని మరింత పెంచాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరుల విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న మంత్రి, జిల్లాలో సోలార్‌ విద్యుత్‌తో పాటు ఇతర గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ ఇంధన రంగంలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా అత్యంత కీలకమని పేర్కొన్న మంత్రి, రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించి రైతులకు అవసరమైన విద్యుత్ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకు రావాలని చెప్పారు. జిల్లాలో విద్యుత్ సేవల నాణ్యత పెంపు, అభివృద్ధి పనుల వేగవంతం, పునరుత్పాదక ఇంధన విస్తరణ, రైతులకు మెరుగైన సేవలందించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో పాటు, ఈపీడీసీఎల్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *