Breaking News

పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుకు వైసీపీ మద్దతు

-రాష్ట్ర ప్రభుత్వాల నియామక పరీక్షలను కూడా చట్టం పరిధిలోకి తీసుకురావాలని సూచన
-ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ-2025పై సీబీఐ విచారణ జరపాలి
-విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. అయితే పరీక్షల్లో అక్రమాలను పూర్తిగా అరికట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వాల నియామక సంస్థలను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని ఎంపీ గురుమూర్తి సవరణ చేయాలని కోరారు.

ఈ బిల్లులో పరీక్షల అక్రమాలకు పాల్పడే వ్యక్తులు, సేవా సంస్థలు, నిర్వాహకులపై శిక్షలు, జరిమానాలను భారీగా పెంచడం, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు, రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయడం, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటి నిబంధనలు స్వాగతించదగినవని పేర్కొన్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న చట్టం కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలకు మాత్రమే వర్తిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాల నియామక బోర్డులు, పరీక్షల నిర్వహణ సంస్థలను ఇందులో చేర్చకపోవడం వల్ల చట్టం అసంపూర్ణంగా మారుతుందని విమర్శించారు. 2005 నుంచి 2026 వరకు దేశవ్యాప్తంగా 220 ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనల్లో సుమారు 10 కోట్ల మంది విద్యార్థులు నష్టపోయారని గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మెగా డీఎస్సీ నియామకాలలో తీవ్ర అవకతవకలు జరిగాయని గురుమూర్తి ఆరోపించారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 3.52 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారని తెలిపారు. స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలో 12 ఏళ్లుగా అమలులో ఉన్న అర్హత పరీక్ష నిబంధనను నియామక ప్రక్రియ ప్రారంభమైన రోజే జీవో నెం.4, జీవో నెం.47 ద్వారా తొలగించి, నియామకాలు పూర్తయ్యాక మళ్లీ జీవో నెం.25, జీవో నెం.56 ద్వారా పునరుద్ధరించారని చెప్పారు. ఈ మధ్య కాలంలో 384 మంది స్పోర్ట్స్ కోటా అభ్యర్థులను అర్హత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ కూడా నిర్వహించకుండా నియమించారని సభ దృష్టికి తీసుకెళ్లారు.

అలాగే డీఎస్సీ ప్రశ్నాపత్రాన్ని టైప్ చేసిన ఎస్సీఈఆర్‌టీలోని కాంట్రాక్ట్ ఉద్యోగి అదే పరీక్షలో 89.74 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం, అనంతరం అతని పేరు తుది ఎంపిక జాబితా నుంచి తొలగించబడటం తీవ్ర అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. ఈ వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని గుర్తు చేశారు. “నేను ఎవరినీ నేరుగా ఆరోపించడం లేదు. కానీ ప్రశ్నాపత్రం టైప్ చేసిన వ్యక్తే మొదటి ర్యాంకు సాధించి, తర్వాత ఎంపిక జాబితా నుంచి అదృశ్యమవడం యాదృచ్ఛికమా, లేక విచారణ జరగాల్సిన అంశమా” అని సభ దృష్టికి తీసుకెళ్లారు.

ఉపాధ్యాయ పోస్టుల విక్రయానికి సంబంధించిన ఆడియో వ్యవహారంలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో కూడా నిందితుడి ఫోన్ నంబర్ తెలిసినా అతడిని “సస్పెక్ట్”గానే పేర్కొన్నారని, కేసు నమోదు ఆలస్యానికి “ఉన్నతాధికారులతో సంప్రదించామని” అని ఫైల్‌లోనే నమోదు చేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నా పైస్థాయి అనుమతి అవసరమయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర నియామక బోర్డులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని, ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని, నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని గురుమూర్తి డిమాండ్ చేశారు.

గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 1,84,264 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినప్పటికీ ఒక్క ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణ కూడా రాలేదని, ఫోన్ కాల్‌ సిఫారసులతో ఉద్యోగాలు వచ్చిన ఘటన లేదని పేర్కొన్నారు. పేద కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం వారి కష్టపడి చదివిన ప్రతిభ ఆధారంగానే రావాలని, ఫోన్ కాల్ సిఫారసులు, రాజకీయ పలుకుబడి లేదా అక్రమాల ద్వారా కాదని గురుమూర్తి స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *