Breaking News

భావి వైద్యుల్లో ప్రతిభా వికాసానికి డా. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మరో వినూత్న అడుగు

-తొలిసారిగా ‘ఇంటర్ కాలేజియేట్ కల్చరల్ మీట్–2026’ కర్టెన్ రైజర్
-ఆగస్టు 12–14 వరకు ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాలలో రాష్ట్రస్థాయి సాంస్కృతిక మహోత్సవం
-విద్యతో పాటు సృజనాత్మకత, నాయకత్వం, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యత – ఉపకులపతి డా. పి. చంద్రశేఖర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థుల సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని డా. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం (డా. ఎన్టీఆర్ యూహెచ్‌ఎస్), విజయవాడ తొలిసారిగా నిర్వహిస్తున్న *’ఇంటర్ కాలేజియేట్ కల్చరల్ మీట్–2026’* కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ గౌరవ ఉపకులపతి డా. పి. చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డా. టి. సాయి సుధీర్ మంగళవారం విశ్వ విద్యాలయంలో సంయుక్తంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉపకులపతి డా. పి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాల పెంపుతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న కళా ప్రతిభ, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి విశ్వవిద్యాలయం సమాన ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనుబంధ మెడికల్, డెంటల్ కళాశాలల విద్యార్థులు తమ ప్రతిభను చాటుకోవడానికి, పరస్పరం అనుభవాలను పంచుకోవడానికి, ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందించుకోవడానికి ఈ ఇంటర్ కాలేజియేట్ కల్చరల్ మీట్–2026 ఉత్తమ వేదికగా నిలుస్తుందన్నారు.

తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ సాంస్కృతిక మహోత్సవం భావి వైద్యుల్లో ప్రతిభను వెలికితీయడమే కాకుండా సృజనాత్మకత, స్నేహభావం, ఐక్యత, సాంస్కృతిక విలువలను మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయం ప్రతిష్ఠాత్మక వార్షిక వేడుకగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు.

రిజిస్ట్రార్ డా. టి. సాయి సుధీర్ మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సంభాషణా నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, జట్టు భావన మరింత పెరుగుతాయని తెలిపారు. వైద్య విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసానికీ విశ్వవిద్యాలయం సమాన ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.

ఆగస్టు 12–14 వరకు ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాలలో నిర్వహణ

ఇంటర్ కాలేజియేట్ కల్చరల్ మీట్–2026 ను ఆగస్టు 12 నుంచి 14 వరకు గుంటూరు జిల్లా చినకాకానిలోని ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాలలో నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ రాష్ట్రస్థాయి సాంస్కృతిక వేడుకల్లో సింగింగ్, క్లాసికల్ డ్యాన్స్, గ్రూప్ డ్యాన్స్, ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్, మోనో యాక్టింగ్, క్విజ్, యోగాసనాలు తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు.

కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు డైరెక్టర్ (రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) డా. సూర్యప్రభ, డైరెక్టర్ (పబ్లికేషన్స్) డా. కె. సుధ, విశ్వవిద్యాలయ అధికారులు, సిబ్బంది, ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొని కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *