-గ్రామీణ మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
-వ్యవసాయ, పారిశ్రామిక, రిటైల్ రంగాలకు రుణాల మంజూరులో బ్యాంకులు చొరవ చూపాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లాలో అన్ని ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు, ఏ ఒక్క రైతు కూడా పీఎం ఫసల్ బీమా యోజన (PMFBY) పరిధికి వెలుపల ఉండకుండా 100 శాతం నమోదు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత శాఖల అధికారులను, బ్యాంకర్లను ఆదేశించారు. అలాగే గ్రామీణ మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, స్వయం ఉపాధి అవకాశాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. విజయవాడ కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ (DCC), జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (DLRC) సమావేశాలు నిర్వహించారు. సమావేశంలో కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డుల జారీ, పీఎం ఫసల్ బీమా యోజన నమోదు, మెప్మా, డీఆర్‌డీఏ రుణాల మంజూరు, ఏపీ టిడ్కో గృహాల నిర్మాణ పురోగతి, వార్షిక రుణ ప్రణాళిక అమలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. జూలై నెలలో 69 శాతం లోటు వర్షపాతం నమోదైందని, రానున్న మూడు నెలల్లో కూడా సాధారణ వర్షపాతం కంటే 35 నుంచి 40 శాతం వరకు లోటు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున రైతులకు ముందస్తు సూచనలు అందించి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రతి రైతు పీఎం ఫసల్ బీమా యోజన పరిధిలోకి వచ్చేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం, పీఎం ఫసల్ బీమా యోజన కింద ఈ నెల 31వ తేదీ వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, వరి పంటకు ఆగస్టు 15 వరకు అవకాశం ఉన్నందున రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి లోటు వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి సాగుపై పూర్తిగా ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే పశువులకు మేత కొరత రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మెప్మా, డీఆర్‌డీఏ ద్వారా సమర్పించిన డీపీఆర్‌ల ప్రకారం లబ్ధిదారులకు 100 శాతం రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు కలెక్టర్ సూచించారు. రుణాల మొత్తాన్ని తగ్గించడం వల్ల ప్రాజెక్టుల స్థాపనలో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, రిటైల్ రంగాలకు అవసరమైన రుణాలను విస్తృతంగా అందించడంతో పాటు సీసీఆర్‌సీ కార్డు కలిగిన కౌలు రైతులకు కూడా రుణాల మంజూరును పెంచాలని కోరారు. గ్రామీణ మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై ప్రత్యేక అవగాహన, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు బ్యాంకింగ్ సేవలు, పొదుపు, రుణ వినియోగం, డిజిటల్ లావాదేవీలు, ఆర్థిక ప్రణాళిక వంటి అంశాలపై విస్తృత స్థాయిలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. మహిళల ఆర్థిక సాధికారతకు బ్యాంకులు, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 2025–26 జిల్లా వార్షిక రుణ ప్రణాళికను 100 శాతం సాధించినందుకు జిల్లా లీడ్ బ్యాంకు, అన్ని బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా లక్ష్యాలను అధిగమించాలని ఆకాంక్షించారు.
సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ పి.వెంకటసుబ్బయ్య, డీసీసీ–డీఎల్‌ఆర్‌సీ కన్వీనర్ ఎం.వి.తిలక్, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ డైరెక్టర్ వి.అమరేశ్వర రెడ్డి , ఆర్‌బీఐ ఎల్‌డీఓ ఏ.రామకృష్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డీఎంఎఫ్ విజయ్ కుమారి, డీఆర్‌డీఏ పీడీ ఏ.ఎన్.వి.నాంచార్రావు, మెప్మా పీడీ మురళీకృష్ణ ప్రసాద్, వివిధ బ్యాంకుల కంట్రోలర్లు, బ్యాంకర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News