అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతికి ప్రధాన అనుసంధాన రహదారి సీడ్‌యాక్సెస్‌రోడ్డు ఫేజ్-2, ఫేజ్-3 పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణ పనుల పురోగతిని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్‌పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి డి.లక్ష్మీపార్థసారథి వారు మంగళవారం పరిశీలించారు.
ఉండవల్లిలోని బకింగ్‌హాం కెనాల్ మీద 110 మీటర్ల పొడవుతో 18 మీటర్ల వెడల్పుతో జరుగుతున్న స్టీల్ బ్రిడ్జి పనులను వేగంగా పూర్తిచేయాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. ఇక్కడి నుండి కొండవీటివాగుపై 284 మీటర్ల పొడవుతో 12 మీటర్ల వెడల్పుతో చేపడుతున్న స్టీల్‌బ్రిడ్జి నిర్మాణాలను పరిశీలించారు.
ఈ వంతెనకు అప్రోచ్‌రోడ్డు పనులు నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఫేజ్-2లో మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి కొండవీటివాగు మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి వరకు జరుగుతున్న సీడ్‌యాక్సెస్‌రోడ్డు నిర్మాణ పనులను వేగంవంతంగా పూర్తిచేయాలని ఏడీసీ ఛీఫ్ ఇంజినీరు టి.మోజెస్‌కుమార్ ను ఆదేశించారు.
ఈ రోడ్డులో 15 మీటర్ల మేర ఏర్పాటు చేయనున్న బఫర్‌జోన్ పనులకు ప్రణాళికలు రూపొందించాలని ఉద్యానవన విభాగం అధికారులను ఆదేశించారు. ఉండవల్లి వద్ద స్టీల్ బ్రిడ్జికి రెండు వైపులా 7 బఫర్ ప్రదేశాలు ఉండగా అందులో అందమైన పూల చెట్లను నాటించాలని ఉద్యావన విభాగం డిప్యూటీ డైరెక్టర్ బి.శ్రీనివాసులును ఆదేశించారు. స్పాతోడియా, కాసియో ఫిస్టులా వంటి మొక్కలను బఫర్ ప్రదేశాలలో ఏర్పాటు చేయాలన్నారు.
ఈ పర్యటనలో ఏడీసీ సూపరింటెండింగ్ ఇంజినీరు టి.వైకుంఠరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు ఎం.శ్రీధర్‌రెడ్డి. డీఈఈ వై. అప్పాజి, హార్టికల్చర్ సీనియర్ కన్సల్టెంట్ విశ్వప్రసాద్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News