Breaking News

అత్కూరులో అమరావతి ఛాంపియన్‌షిప్–2026 క్రీడా పోటీల ప్రారంభించిన విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ

-గ్రామీణ క్రీడాకారులకు గొప్ప వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ : యార్లగడ్డ
-గన్నవరం నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలి : ఎమ్మెల్యే
-నిడమానూరు, దావాజీగూడంలో ఇండోర్ స్టేడియాల ఏర్పాటుకు కృషి : యార్లగడ్డ
-ఖేలో ఇండియా పథకం ద్వారా గన్నవరానికి మల్టీపర్పస్ ఇండోర్ హాల్ తీసుకొస్తాం : ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలికితీయడంలో అమరావతి ఛాంపియన్‌షిప్–2026 వంటి పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఉంగుటూరు మండలం అత్కూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (సాప్) మినీ ఇండోర్ స్పోర్ట్స్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన అమరావతి ఛాంపియన్‌షిప్–2026 క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ ఎంపికల అనంతరం జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు జరుగుతాయని తెలిపారు. గన్నవరం నియోజకవర్గానికి చెందిన క్రీడాకారులు అధిక సంఖ్యలో రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, చెస్‌, యోగా విభాగాల్లో యువత ప్రతిభ కనబర్చాలని సూచించారు. నియోజకవర్గంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. నిడమానూరు, దావాజీగూడం ప్రాంతాల్లో ఇండోర్ స్టేడియాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ఖేలో ఇండియా పథకం ద్వారా గన్నవరం నియోజకవర్గానికి మల్టీపర్పస్ ఇండోర్ హాల్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా సమానంగా అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో ఆటస్థలాలు, క్రీడా సదుపాయాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఎదిగేలా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా రంగానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, తల్లికి వందనం, స్టూడెంట్ కిట్లు, మనబడి–మన భవిష్యత్ వంటి కార్యక్రమాల ద్వారా గన్నవరం నియోజకవర్గంలో గణనీయమైన నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. అలాగే పాఠశాలలు, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి దాతలు, ఎన్నారైలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం అన్నే సీతారామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, మెనూ అమలు, పరిశుభ్రత తదితర అంశాలపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందేలా సంబంధిత అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం రుచి చూసి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఝాన్సీ లక్ష్మి, గుడివాడ డివైఈవో కొండ రవికుమార్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కొండెటి వెంకటేశ్వరరావు, రిటైర్డ్ అడిషనల్ డిసిపి మురళీకృష్ణ, ఉంగుటూరు ఎంపీడీవో సత్య కుమార్, విద్యా కమిటీ చైర్మన్ ఆత్కూరు సాంబశివరావు,ప్రధానోపాధ్యాయురాలు పున్నమి దేవి, ఉంగుటూరు ఎమ్మార్వో విమల కుమారి, క్రీడాకారులు, ఉపాధ్యాయులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *