-విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ఏ.రవీంద్రరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ ఏ. రవీంద్రరావు బుధవారం తన పర్యటనలో భాగంగా కృష్ణలంక రాణిగారితోట, నేతాజీ బ్రిడ్జ్, పశువుల ఆసుపత్రి జంక్షన్, జాతీయ రహదారి పరిసర ప్రాంతాలను పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సాయిబాబా ఆలయం సమీపంలోని అన్న క్యాంటీన్‌ను సందర్శించి అక్కడి సేవలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఇంచార్జి కమిషనర్ మాట్లాడుతూ, నేతాజీ బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన మొక్కలు ఎల్లప్పుడూ పచ్చదనంతో కళకళలాడేలా ప్రతిరోజూ నీటి సరఫరా, నిర్వహణ చర్యలు క్రమం తప్పకుండా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నగర పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పరిశుభ్రమైన వాతావరణాన్ని కొనసాగించాలని సూచించారు. రహదారులపై చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు వ్యర్థాలను తరలించి, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.
అనంతరం సాయిబాబా ఆలయం వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను పరిశీలించి, లబ్ధిదారులకు టోకెన్లు పారదర్శకంగా అందిస్తున్నారా, నిర్ణీత సమయానికి క్యాంటీన్‌ను ప్రారంభిస్తున్నారా, ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నారా అనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ (ఇన్‌చార్జి) డాక్టర్ గోపాల్ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News