మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి లోక్‌సభలో పోస్టల్ సేవలపై విధిస్తున్న జీఎస్టీకి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. సాధారణ తపాలా సేవలకు జీఎస్టీ మినహాయింపు ఉన్నప్పటికీ, స్పీడ్ పోస్ట్‌తో పాటు ఇతర పోస్టల్ సేవలపై జీఎస్టీ ఎందుకు విధిస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దీనికి కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ సమాధానమిస్తూ, ప్రస్తుతం పోస్ట్‌కార్డులు, ఇన్‌ల్యాండ్ లెటర్లు, బుక్‌పోస్ట్, 10 గ్రాముల లోపు సాధారణ తపాలా కవర్లు వంటి సేవలకు మాత్రమే జీఎస్టీ మినహాయింపు ఉందని తెలిపారు.
అదేవిధంగా, తపాలా శాఖ అందిస్తున్న జీవిత బీమా సేవలు కూడా జీఎస్టీ నుంచి మినహాయింపులో ఉన్నాయని వెల్లడించారు.
అయితే, స్పీడ్ పోస్ట్‌తో పాటు మినహాయింపు జాబితాలో లేని ఇతర పోస్టల్ సేవలన్నీ జీఎస్టీ పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ, ప్రజలకు తక్కువ వ్యయంతో సేవలు అందించే భారత తపాలా శాఖపై జీఎస్టీ భారం తగ్గించడం అవసరమన్నారు. ప్రైవేట్ కొరియర్ సంస్థలతో పోటీ పడేందుకు స్పీడ్ పోస్ట్ సహా మరిన్ని పోస్టల్ సేవలకు జీఎస్టీ మినహాయింపు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, స్పీడ్ పోస్ట్ (ఈఎంఎస్), అంతర్జాతీయ పోస్టల్ సేవలు, దేశీయ బుక్ ప్యాకెట్లు, రిజిస్టర్డ్ వార్తాపత్రికలు, 20 గ్రాముల వరకు లేఖలు తదితర సేవలకు జీఎస్టీ మినహాయింపు కల్పించాలని తపాలా శాఖ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని సీబీఐసీకి పలుమార్లు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించింది.
మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తడం ద్వారా ప్రజలకు, చిన్న వ్యాపారులకు మరియు తపాలా సేవలను వినియోగించే లక్షలాది మందికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News