మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా కోడూరు మండలం, కోడూరు గ్రామ పంచాయతీలో ఈరోజు నిర్వహించిన “స్వచ్ఛ పదం” కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యం.ధనలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రమైన పరిసరాల కల్పన, ఘన వ్యర్థాల నిర్వహణ, డ్రైనేజీల పరిశుభ్రత, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, తడి-పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలను ఉద్దేశించి జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం తడి, పొడి వ్యర్థాలను విడివిడిగా అందజేయాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, గ్రామ పరిశుభ్రత కార్యక్రమాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలను అభినందిస్తూ, పరిశుభ్రత కార్యక్రమాలను నిరంతరం సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ పరిధిలో స్వచ్ఛత ప్రమాణాలను మరింత మెరుగుపరచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, మండల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News