-కేంద్ర క్రీడా శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేను విన్నవించిన మంత్రి కొల్లు రవీంద్ర
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లాలోని క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు వీలుగా ఇండోర్ స్టేడియం, స్మిమ్మింగ్ పూల్ నిర్మాణానికి ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా సహాయం అందించాలని కేంద్ర యువజన, క్రీడా శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సేను ఢిల్లీలోని వారి కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర కలిసి వినతి పత్రం అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) ద్వారా ఏపీలోని ప్రతి జిల్లాలో క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ & జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ ఇప్పటికే MDSD పోర్టల్ ద్వారా అవసరమైన అన్ని పత్రాలను సమర్పించారని, మంత్రిత్వ శాఖ పరిశీలన, సాంకేతిక అంచనాలు మరియు ఇతర అవసరమైన పత్రాలను శాప్ తరఫన పంపించామని వివరించారు. మచిలీపట్నం గోసంఘం వద్ద నిర్మించ తలపెట్టిన ఇండోర్ స్టేడియం కోసం రూ.17 కోట్లు, స్మిమ్మింగ్ పూల్ కోసం రూ.9 కోట్ల నిధులు అవసరమవుతాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంతంలో క్రీడా మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపడతాయి. క్రీడాకారులకు ఆధునిక శిక్షణా సదుపాయాలను అందించగలుగుతాం. ప్రతిపాదిత ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ ద్వారా స్థానిక క్రీడా ప్రతిభను పెంపొందించడానికి, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగకరంగా ఉంటాయి. క్రీడలలో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి మరిన్ని అవకాశాలు కలిగిస్తాయి. కృష్ణా జిల్లాలో ఒక ముఖ్యమైన పట్టణ కేంద్రంగా ఉన్న మచిలీపట్నం, ప్రాంతీయ క్రీడా కేంద్రంగా ఆవిర్భవించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ సదుపాయాల ఏర్పాటు ఖేలో ఇండియా కార్యక్రమం యొక్క లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడుతుంది. అందువలన ఖేలో ఇండియా పథకం కింద మొత్తం ₹26.50 కోట్ల అంచనా వ్యయంతో పై ప్రాజెక్టులకు పరిపాలనా, ఆర్థిక పరమైన అనుమతులు మంజూరు చేయాలని విన్నవించగా కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా ఉన్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
Prajavartha Online Telugu News