-ఏపీలో క్రిటికల్ మినరల్స్ పార్క్, రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటుకు సహకారం అందించండి
-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి విన్నవించిన మంత్రి కొల్లు రవీంద్ర
న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపారమైన ఖనిజ వనరులు, రేర్ ఎర్త్ మినరల్స్ అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర మైనింగ్ రంగాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని ఢిల్లీలోని వారి కార్యాలయంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కలిసి విన్నించారు. రాష్ట్రంలో క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు, ఆంధ్రాయూనివర్శిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఏర్పాటు, ఏపీ రేర్ ఎర్త్ కారిడార్ అభివృద్ధిపై ప్రతిపాదనలు అందించారు. రాష్ట్రంలోని ఖనిజాలు, స్ట్రాటజిక్ మినరల్స్‌కు ప్రపంచ స్థాయి వేల్యూ యాడెడ్ పరిశ్రమ ఏర్పాటు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఏర్పాటు ద్వారా సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. తయారీ, ఎగుమతులను కలుపుతూ సమగ్రమైన రేర్ ఎర్త్ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తరఫున సహకారం అందించాలని కోరారు. దేశ మైనింగ్ అవసరాలు తీర్చేలా స్థానికంగానే అన్ని పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
Prajavartha Online Telugu News