-లోక్‌సభలో నియమం-377 కింద విజయవాడ ప్రజల ఆకాంక్షలను పార్లమెంట్ వేదికగా ప్రతిపాదించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఇంద్రకీలాద్రి దేవస్థాన అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) లోక్‌సభలో బలంగా కోరారు.తిరుపతి తరువాత అత్యంత ప్రాధాన్యత మరియు భక్తుల తాకిడి కలిగిన విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం పై బుధవారం జరిగిన లోక్‌సభ సమావేశంలో నియమం-377 కింద ప్రత్యేక అంశాన్ని ఎంపీ చిన్ని ప్రతిపాదించారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన శాశ్వత మౌలిక సదుపాయాలు, యాత్రికుల సౌకర్యాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
విజయవాడకు ఆధ్యాత్మిక చిహ్నం – కనకదుర్గ అమ్మవారి ఆలయం..
కృష్ణా నది తీరాన ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం శతాబ్దాల చరిత్ర కలిగిన పవిత్ర శక్తిపీఠమని ఎంపీ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తున్న ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన దేవాలయాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, శ్రీదేవి అలంకారాలు, తెప్పోత్సవం, భవానీ దీక్షల సందర్భంగా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారని తెలిపారు.
భక్తుల సంఖ్య పెరుగుతోంది… శాశ్వత మౌలిక సదుపాయాలు కూడా అదే స్థాయిలో ఉండాలని ఎంపీ సూచన
ప్రతిరోజూ సుమారు 50 వేల మంది, పండుగల సమయంలో రెండు లక్షలకు పైగా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నప్పటికీ, అదే స్థాయిలో శాశ్వత మౌలిక వసతులు కూడా కల్పించాలి అని కేంద్రానికి సూచన
ప్రసాద్ పథకం కింద భారీ అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలి..
ఆలయ సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం PRASHAD (Pilgrimage Rejuvenation and Spiritual Heritage Augmentation Drive) పథకం కింద ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎంపీ కేశినేని శివనాథ్ డిమాండ్ చేశారు.
ఆ నిధులతో…
* బహుళ అంతస్తుల కార్ పార్కింగ్ నిర్మాణం
* విశాలమైన బహుళ అంతస్తుల వెయిటింగ్ హాల్
* ఆధునిక యాత్రికుల సౌకర్య కేంద్రాలు
* రద్దీని తగ్గించే రహదారుల విస్తరణ
* ట్రాఫిక్ నిర్వహణకు శాశ్వత ప్రణాళిక
* పరిశుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి కేంద్రాలు
* డిజిటల్ సమాచార కేంద్రాలు, భక్తుల సౌకర్య సేవలు
వంటి సౌకర్యాలను అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.
పర్వతమాల పథకం కింద రోప్‌వే – భక్తులకు వరం..
వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలతో వచ్చే కుటుంబాలు కొండపై ఉన్న ఆలయానికి సులభంగా చేరుకునేందుకు పర్వతమాల (Parvatmala) పథకం కింద ఆధునిక రోప్‌వే వ్యవస్థను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ కోరారు. రోప్‌వే ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు భక్తుల ప్రయాణం వేగవంతం, సురక్షితంగా మారుతుందని తెలిపారు.
వారణాసి – అయోధ్య తరహాలో విజయవాడ అభివృద్ధి చెందాలి..
వారణాసి, అయోధ్య వంటి పుణ్యక్షేత్రాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేసిన ఎంపీ, అదే తరహాలో కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని కూడా ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ అభివృద్ధి వల్ల విజయవాడలో పర్యాటక రంగం విస్తరించడంతో పాటు హోటళ్లు, రవాణా, చిన్న వ్యాపారాలు, స్థానిక కళాకారులు, యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు.
విజయవాడ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం..
కనకదుర్గ అమ్మవారి ఆలయ అభివృద్ధి కేవలం ఆధ్యాత్మిక రంగానికే పరిమితం కాకుండా విజయవాడ నగర ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త ఊపునిస్తుందని ఎంపీ పేర్కొన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే యాత్రికుల సంఖ్య మరింత పెరిగి స్థానిక వ్యాపారాలు, పర్యాటక రంగం, సేవా రంగం అభివృద్ధి చెందుతాయని చెప్పారు.
ప్రజల ఆకాంక్షలను పార్లమెంట్ వేదికగా వినిపించాను – ఎంపీ కేశినేని శివనాథ్..
విజయవాడ ప్రజల ఆకాంక్ష గా ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయ సమగ్ర అభివృద్ధి అంశాన్ని లోక్‌సభ దృష్టికి తీసుకువచ్చానని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. భక్తులకు అన్ని విధాలా మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ ప్రతిష్ఠను మరింత పెంచడం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి..
శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం ప్రసాద్ పథకం కింద ప్రత్యేక నిధులు, పర్వతమాల పథకం కింద రోప్‌వేకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం చేశారు.
Prajavartha Online Telugu News