Breaking News

గ్రీన్ హైడ్రోజన్ వాహనాల అభివృద్ధికి కేంద్రం వేగవంతమైన చర్యలు

-ఆంధ్రప్రదేశ్‌కు విశాఖపట్నం–బయ్యవరం మార్గంలో పైలట్ ప్రాజెక్టు…
-లోక్ సభ లో ఎంపీ కేశినేని చిన్ని కీలక ప్రశ్న

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసి, స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని లోక్‌సభలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది .

లోక్‌సభలో నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖకు ఎంపీ కేశినేని శివనాథ్ హైడ్రోజన్ ఆధారిత వాహనాలు, హైడ్రోజన్ ఇంధనం నింపే స్టేషన్లు, రాష్ట్రాల వారీగా ఆమోదించిన ప్రాజెక్టులు, వాటికి కేటాయించిన నిధులు, అలాగే గ్రీన్ హైడ్రోజన్ వాహనాల పనితీరు, భద్రత మరియు మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న పర్యవేక్షణ వ్యవస్థ గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

దీనికి కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన, విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద యెస్సో నాయక్ సమాధానం ఇస్తూ, జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ (National Green Hydrogen Mission – NGHM) కింద దేశాన్ని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం మరియు ఎగుమతుల్లో ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను అమలు చేస్తోందని తెలిపారు.

మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 21 మార్గాల్లో 16 హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ స్టేషన్లతో పాటు మొత్తం 70 హైడ్రోజన్ ఆధారిత వాహనాల నిర్వహణకు 12 పైలట్ ప్రాజెక్టులు మంజూరు చేశారు. వీటిలో 27 హైడ్రోజన్ బస్సులు మరియు 43 హైడ్రోజన్ ట్రక్కులు ఉన్నాయి. ఇవి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాలు (HFCV), హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (HICE) సాంకేతికతలతో నడుస్తాయి.

ఈ ప్రాజెక్టుల అమలుకు కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.410.77 కోట్లు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయగా, ఇప్పటివరకు రూ.41.582 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

రెండో దశలో కూడా మరిన్ని ప్రాజెక్టులను ఆమోదించి, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అదనపు హైడ్రోజన్ బస్సులు, ట్రక్కులను ప్రయోగాత్మకంగా నడపనున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విశాఖపట్నం – బయ్యవరం (NH-16) మార్గంలో HPCL–Volvo కన్సార్టియం ద్వారా 40 టన్నుల హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (HICE) ట్రక్ పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో హైడ్రోజన్ ఆధారిత భారీ వాణిజ్య వాహనాల వినియోగానికి నాంది పలకనుంది.

అంతేకాకుండా, గ్రీన్ హైడ్రోజన్ వాహనాల పనితీరు, ఇంధన వినియోగ సామర్థ్యం, భద్రతా ప్రమాణాలు, నిర్వహణ వ్యయం, వినియోగ అనుభవం వంటి అంశాలపై వ్యవస్థీకృత పర్యవేక్షణ మరియు అభిప్రాయ సేకరణ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. పైలట్ ప్రాజెక్టులను అమలు చేస్తున్న సంస్థలు క్రమం తప్పకుండా నివేదికలు సమర్పిస్తుండగా, వాటి ఆధారంగా హైడ్రోజన్ ఆధారిత రవాణా సాంకేతికతకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలను అంచనా వేసి, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ వాహనాల విస్తరణకు అవసరమైన విధానాలను రూపొందించనున్నట్లు వివరించారు.

ఈ సమాధానం ద్వారా దేశంలో స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, భవిష్యత్తు రవాణా రంగంలో గ్రీన్ హైడ్రోజన్‌కు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టమైందని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, దిగుమతి ఇంధనాలపై ఆధారపడటం తగ్గించడం, పర్యావరణహిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడం వంటి లక్ష్యాల సాధనలో ఈ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *