-సమన్వయoతో సీజనల్ వ్యాధులపై ముందస్తు హెచ్చరికలు అందగానే అప్రమత్తం కావాలి
-హాస్టల్‌లో ఒక్క విద్యార్థి అనారోగ్యానికి గురైనా తక్షణo స్పందిoచాలి
-తాగునీరు, ఆహార నాణ్యత పై ప్రత్యేక దృష్టి అవసరం
-పాముకాటు మందులు, రేబిస్ టీకాలు అందుబాటులో ఉంచాలి
-ప్రభుత్వ శాఖల సమన్వయ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సీజనల్ వ్యాధులు ముఖ్యంగా వర్షాకాలంలో మలేరియా, డెంగీ, కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చాలా అవసరమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర ప్రధాన కార్యాలయాల వరకు సదరు ప్రభుత్వ శాఖల మధ్య సీజనల్ వ్యాధులు నియంత్రణపై నిరంతరం సమావేశాలు, సమన్వయ చర్యలు కొనసాగు తూ ఉండాలని చెప్పారు.
అంటూ వ్యాధులు వ్యాప్తి చెందిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే ప్రమాదాన్ని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రజారోగ్యం ఒక్క ఆరోగ్య శాఖ బాధ్యత కాదని, సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
వర్షాకాల వ్యాధుల నివారణ, నియంత్రణపై వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి, పురపాలక, విద్య, సంక్షేమ, పశుసంవర్ధక, మత్స్య, వ్యవసాయ, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖల అధికారులతో బుధవారం ‘వర్చువల్’ గా నిర్వహించిన ప్రభుత్వ భాగస్వామ్య శాఖల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు.
హాస్టళ్లు, పాఠశాలలు, గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని వీరపాండియన్ సూచించారు. హాస్టల్‌లో ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైన తర్వాతే సమాచారం ఇవ్వాలనే ధోరణి ఉండకూడదన్నారు. ఒక్క విద్యార్థికి జ్వరం, కడుపునొప్పి, కామెర్లు, నీరసం వంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్య సిబ్బందికి తెలియజేయాలని చెప్పారు. హాట్‌స్పాట్లను ముందుగానే గుర్తించేందుకు సంయుక్త తనిఖీ బృందాలు క్రమం తప్పకుండా పర్యటించాలని ఆదేశించారు.
నీటి నాణ్యత పై నిరంతర పర్యవేక్షణ
తాగునీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, నీటి నమూనాల సేకరణ పరీక్షలు నిరంతరం జరుగుతుండాలన్నారు. ప్రతికూల ఫలితాలు వచ్చిన వెంటనే ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా, క్లోరినేషన్ వంటి చర్యలు చేపట్టాలన్నారు. ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైపులైన్ల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు.
వండిన ఆహారమే అందించాలి
హాస్టళ్లలో విద్యార్థులకు ఏ పూటకు ఆ పూట తాజాగా వండిన ఆహారమే అందించాలని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఆహార విషబాధ ఘటనల్లో గుర్తించిన లోపాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను అన్ని జిల్లాలకు పంపాలని ఓ అధికారి సూచించారు. ఆహార వ్యర్థాలను సక్రమంగా తొలగించకపోతే ఎలుకలు, దోమల సమస్య పెరుగుతుందని, స్థానిక సంస్థలు, వ్యవసాయ శాఖ కలిసి ఎలుకల నియంత్రణ చర్యలు చేపట్టాలని మరో అధికారి చెప్పారు. దోమల లార్వా నియంత్రణలో భాగంగా చెరువులు, ఇతర నీటి వనరుల్లో గంబూసియా చేపల పెంపకానికి అనువైన ప్రాంతాలను గుర్తించాలని మత్స్యశాఖను కార్యదర్శి ఆదేశించారు.
వీధికుక్కల నియంత్రణ, రేబిస్ నివారణకు పశుసంవర్ధక, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు కలిసి కార్యాచరణ రూపొందించాలని వీరపాండియన్ ఆదేశించారు. కుక్కల స్టెరిలైజేషన్, రేబిస్ టీకాల కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించి వారం రోజుల్లో పురోగతిని సమీక్షించాలన్నారు. పాముకాటు బాధితులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనే సకాలంలో చికిత్స అందేలా ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, పారిశుధ్యం, ఆహార భద్రత, ఆరోగ్య పరిరక్షణ, రిఫరల్ వ్యవస్థ.. ఈ ఐదు అంశాలపై అన్ని శాఖలు ప్రధానంగా దృష్టి పెట్టాలని వీరపాండియన్ స్పష్టం చేశారు. పీహెచ్‌సీ స్థాయిలో వారానికోసారి, జిల్లా స్థాయిలో క్రమం తప్పకుండా సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ తీసుకున్న నిర్ణయాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
Prajavartha Online Telugu News