-మూడు లక్షల మందితో విజయవంతం చేయడమే లక్ష్యం
-విజయనగరంలో అభివృద్ధి పనులకు మరిన్ని నిధులు: మంత్రులు నారాయణ, గొట్టిపాటి
విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విజయనగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
పురపాలకశాఖ మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం విజయవంతం కోసం మంత్రులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ స్థానిక నాయకులను సమన్వయం చేస్తున్నామని చెప్పారు. సుమారు మూడు లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున రవాణా, భద్రత, ఇతర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించామని, VMRDA నిధులతో Rs. 21 కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. అదనంగా నగర అభివృద్ధి కోసం మరో Rs. 20 కోట్ల నిధులు మంజూరు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలోనే భోగాపురం విమానాశ్రయానికి పునాది పడిందని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు నిర్లక్ష్యానికి గురైనప్పటికీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగవంతంగా పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేసిందన్నారు.
ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమం విజయవంతం కోసం ఇప్పటికే ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తున్నామని చెప్పారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా, ట్రాఫిక్, ఇతర సౌకర్యాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమై ప్రాంతీయ సమస్యలపై చర్చించినట్లు చెప్పారు. విజయనగరంలో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News