విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తరాలను ప్రభావితం చేసేది సాహిత్యమేనని, అక్షరం మెరుగైన సమాజాన్ని సృష్టిస్తుందని రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మక సమితి అధ్యక్షురాలు పి. తేజస్వి అన్నారు. పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బీఎస్సీ విద్యార్థిని రామవరపు స్రవంతి రాసిన కథల సంపుటి నచ్చితే మళ్లీ కలుస్తాను బుధవారం వెబినార్ హాలులో ఆమె ఆవిష్కరిస్తూ పుస్తకం టైం మిషన్ లాగా అద్భుత టెక్నాలజీ అన్నారు. బిల్ గేట్స్ ఏటా 50 పుస్తకాలు చదువుతారని, ఎలాన్ మస్క్ రోజూ పదిగంటల పఠనం వల్లే సాంకేతికతలో దిట్ట కాగలిగాడన్నారు. సామాజిక మాధ్యమానికి బానిస అయిన యువతరం స్క్రీన్ టైం బాగా తగ్గించాలని, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని, వీసాల కోసం ఇతరదేశాలకు వెంపర్లాడటం కాకుండా మనదేశానికే అందరూ పోటెత్తే రోజు రావాలన్నారు. రాష్ట్రప్రభుత్వం ఉగాది పురస్కారాల్లో యువతకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా సంస్కరణలు తెచ్చిందన్నారు. కన్వీనర్ నిమ్మగడ్డ లలితప్రసాద్ తొలిప్రతి అందుకుని విద్యార్థినిని అభినందిస్తూ 10 వేల రూపాయల నగదు బహుమతి అందచేశారు. బీఎస్సీ కెమిస్ట్రీ విద్యార్థిని భువనశ్రీ ఈ కథాసంపుటిని సమీక్షించింది. ప్రిన్సిపాల్ డా. మేకా రమేశ్ , డీన్ ఆచార్య రాజేశ్ సి. జంపాల, లైబ్రేరియన్ డా. వాణిశ్రీ. రచయిత్రి ఆర్.స్రవంతి మాట్లాడారు.
Prajavartha Online Telugu News