Breaking News

ఆర్టీసీ జేఏసి మూడవ దశ ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్ విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీయస్ ఆర్టీసీలో విద్యుత్ బస్సుల పేరుతో ప్రవేటు ఆపరేటర్లకు అవకాశం కల్పిస్తూ వేలకోట్లు విలువైన ఆర్టీసి డిపో స్దలాలను విధ్యుత్ బస్సు ఆపరేటర్లకు లీజుపేరుతో కట్టబెట్టి దశలవారిగా ఆర్టీసీని ప్రవేటుపరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలు విరమించుకోవాలని డీమాండ్ చేస్తూ సంస్ద పరిరక్షణ, ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం, పిటిడి(ఆర్టీసి) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసి ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న మూడవ దశ ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్‌ను గురువారం విజయవాడలో ఆర్టీసి ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్లు వై. శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు ప్రకటించారు.

గురువారం విజయవాడ రెవిన్యూభవన్‌లో ఆర్టీసి ఉద్యోగ సంఘాల జేఏసి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈసమావేశంలో జేఏసి కమిటి తీసుకున్న నిర్ణయాల మేరకు మూడవ దశ ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్‌ను దశలవారీగా ఉదృతం చేసేందుకు నిర్ణయించారు.

ఆర్టీసిలో పనిచేస్తున్న ఉద్యోగులంతా ఒక్కటై ఆర్టీసిని విద్యుత్ బస్సులు పేరుతో ప్రవేటు పరము చేయవద్దని, విద్యుత్ బస్సులన్ని ఆర్టీసి ద్వారానే నిర్వహించాలని ఆర్టీసి ఉద్యోగ సంఘాల జేఏసిగా రెండు దశలలో చేపట్టిన శాంతియుత ఉద్యమాలతో సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేసినప్పటికీ ఇంత వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూల స్పందన లేకపోవడంతో మూడవ దశ ఆందోళన కార్యక్రమాలకు సిద్దపడుతున్నామని ప్రకటించారు. ఇప్పటికే వస్తున్న విద్యుత్ బస్సుల కోసం నాలుగు డిపోలను పూర్తిగా కూల్చివేసి పూర్తిగా ప్రవేటు ఆపరేటర్లకు అప్పజెప్పారు. మరో 8 డిపోలలో 50% స్థలాలను ప్రవేటు ఆపరేటర్లకు ఇస్తున్నారని, ఇంకా రాబోతున్న 1450 విద్యుత్ బస్సుల కోసం మరో 29 డిపోలను ప్రవేట్ విద్యుత్ బస్సు ఆపరేటర్లకు కట్టబెట్టేందుకు సిద్ధం చేస్తున్నారని దీనిని బట్టి 2029 నాటికీ ఆర్టీసీలో ఉన్న అన్ని బస్సులు ప్రవేటు వారికీ, అన్ని డిపోలు కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్రలు జరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ కోసం మూడవ దశ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నామని మూసి వేసిన విద్యాధరపురం, గుంటూరు-2, నెల్లూరు-2, మంగళం నాలుగు డిపోలను వెంటనే పునఃప్రారంభించాలని, ప్రవేటు ఆపరేటర్లకు ఇస్తున్న విద్యుత్ బస్సు టెండర్లను నిలుపుదలచేసి ఆర్టీసీ సంస్థ కొనుగోలు చేసి, నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని, డిమాండ్ చేస్తూ ఈ దిగువ మూడవ దశ ఆందోళన షెడ్యూల్ ను ఆర్టీసీ జెఎసి నాయకులుప్రకటించారు.

3వ దశ ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్

-ఆగస్టు 3 న ఆర్టీసీ ఉద్యోగుల సంతకాలతో కూడిన వినతి పత్రాలు కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి గారికి గ్రీవెన్స్ డే (PGRS) కార్యక్రమం ద్వారా అందజేస్తాం

-ఆగష్టు 7/8 తేదీలలో ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలు/అసోసియేషన్స్/రిటైర్డ్/అవుట్ సోర్సింగ్ సంఘాలకు మరియు రాష్ట్ర స్థాయి కేంద్ర కార్మిక సంఘాలకు, విద్యార్థి, యువజన సంఘాలు మరియు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జెఎసి నాయకులకు ఉపాధ్యాయ సంఘాలకు, ప్రభుత్వ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ఉన్న ఇతర సంఘాలకు ఉద్యమానికి మద్దతు కోరుతూ లేఖలు ఇవ్వడం జరుగుతుంది.

-ఆగష్టు 17/18 సోమ/మంగళ వారాలలో అన్ని డిపో/యూనిట్లలలో నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ స్థాయిలో సామూహిక రిలే నిరాహారదీక్షలు రెండు రోజులు జరుగుతాయి.

-ఆగస్టు 28 శుక్రవారం అన్ని జిల్లాలలో ఉన్న జిల్లా ప్రజా రవాణా అధికారి(DPTO) కార్యాలయాల వద్ద భారీగా ఉద్యోగులను సమీకరించి నల్ల బ్యాడ్జీలు ధరించి మహాధర్నాలు నిర్వహిస్తాం.

-సెప్టెంబర్ 3 గురువారం 4వ దశ ఉద్యమ కార్యచరణను తీవ్రతరం చేస్తూ విజయవాడలో ప్రకటన చేయడం జరుగుతుంది.

ఆర్టీసీ పరిరక్షణ కొరకు చేపడుతున్న ఈ మూడవ దశ ఉద్యమంలో ఆర్టీసీలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు/ అసోసియేషన్స్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు బాగస్వాములు అవ్వడం ద్వారా ఆర్టీసీ పరిరక్షణకు తమవంతు సహాయ సహకారాలు అందించాలని ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్లు పి.వి.రమణారెడ్డి, జి.వి.నరసయ్య, సిహెచ్.సుందరయ్య, ఎస్.వి.శేషగిరిరావు, వై.సూర్య ప్రకాష్ రావు, డి.మాల్యాద్రిలు విజ్ఞప్తి చేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *