-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ వేటుకూరి .ఎ.వి.ఎస్. సూర్యనారాయణ రాజు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“మానవ అక్రమ రవాణా అనేది ఇక సరిహద్దులు దాటి జరిగే నేరం మాత్రమే కాదు… మన ఇళ్లలోని మొబైల్ ఫోన్లలోకి, సోషల్ మీడియా ఖాతాల్లోకి, ఉద్యోగ ప్రకటనల రూపంలోకి చొరబడిన అత్యంత ప్రమాదకరమైన సంఘటిత నేరం. మన పిల్లల కలలు, యువత భవిష్యత్తు, కుటుంబాల విశ్వాసాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠాలను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఒక చిన్నారిని లేదా యువకుడిని అక్రమ రవాణా నుంచి రక్షించడం అంటే ఒక జీవితాన్ని, ఒక కుటుంబాన్ని, ఒక భవిష్యత్తును కాపాడినట్టే” అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ వేటుకూరి ఏ.వి.ఎస్. సూర్యనారాయణ రాజు పేర్కొన్నారు.
ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మరియు హెల్ప్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కమిషన్ చైర్పర్సన్ వేటుకూరి ఎ.వి.ఎస్. సూర్యనారాయణ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా హెల్ప్ సంస్థ, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సంయుక్తంగా మానవ అక్రమ రవాణా పై రూపొందించిన గోడ పత్రిక (వాల్ పోస్టర్స్) ను కమిషన్ చైర్పర్సన్ వేటుకూరి ఎ.వి.ఎస్. సూర్యనారాయణ రాజు, కమిషన్ సబ్యులు తో పాటు హెల్ప్ కార్యదర్శి నిమ్మరాజు రామమోహనె సంయుక్తంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కమిషన్ చైర్పర్సన్ వేటుకూరి ఎ.వి.ఎస్. సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ, ప్రస్తుతం మానవ అక్రమ రవాణా పద్ధతులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. ఒకప్పుడు ప్రత్యక్షంగా జరిగే అక్రమ రవాణా ఇప్పుడు నకిలీ ఉద్యోగ ప్రకటనలు, అధిక వేతనాల హామీలు, సోషల్ మీడియా పరిచయాలు, ఆన్లైన్ ప్రేమ ఉచ్చులు, విదేశీ ఉద్యోగ అవకాశాల పేరుతో జరిగే సైబర్ ఆధారిత నేరంగా మారిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా మార్చుకున్న అక్రమ రవాణా ముఠాలను ఎదుర్కోవాలంటే డిజిటల్ అవగాహన, సైబర్ భద్రతపై ప్రజల్లో చైతన్యం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగం ప్రతి చిన్నారికి కల్పించిన హక్కులు రాష్ట్రంలోని ప్రతి బిడ్డకు అందేలా చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం పర్యవేక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
“బాల సంవాద్” కార్యక్రమాల ద్వారా పిల్లల అభిప్రాయాలను తెలుసుకుంటూ, జిల్లా మరియు గ్రామ స్థాయిలో బాలల రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. అలాగే బాలల సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షిస్తూ, బాలల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, బాలలపై లైంగిక దాడుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
ప్రభుత్వ శాఖలు, పోలీసు శాఖ, బాలల సంక్షేమ కమిటీలు (CWCs), జువెనైల్ జస్టిస్ బోర్డులు (JJBs), జిల్లా బాలల రక్షణ విభాగాలు (DCPUs), విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలతో సమన్వయంగా పనిచేస్తూ ప్రతి చిన్నారి సురక్షితమైన, గౌరవప్రదమైన బాల్యాన్ని అనుభవించేలా కమిషన్ కృషి కొనసాగిస్తోందని ఆయన పేర్కొన్నారు.
హెల్ప్ సంస్థ కార్యదర్శి నిమ్మరాజు రామమోహన్ మాట్లాడుతూ ఇటీవల సింగపూర్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు యువతను మయన్మార్‌కు తరలించి, అక్కడ సైబర్ స్కామ్ కేంద్రాల్లో బలవంతంగా పనిచేయించిన సంఘటనను ప్రస్తావిస్తూ, అది కేవలం సైబర్ నేరం మాత్రమే కాదని, అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా ముఠాలు అమాయక యువత కలలను ఎలా దోపిడీ చేస్తున్నాయో చూపించే అత్యంత విషాదకర ఉదాహరణ అని పేర్కొన్నారు.
“మంచి భవిష్యత్తు కోసం ప్రారంభమైన ప్రయాణం చివరకు భయం, బానిసత్వం, దోపిడీగా మారడం ప్రతి కుటుంబానికి గట్టి హెచ్చరిక” అని ఆయన అన్నారు. విదేశీ ఉద్యోగాలు, అధిక వేతనాలపై వచ్చే ప్రకటనలను నమ్మే ముందు పూర్తి స్థాయిలో ధృవీకరించుకోవాలని యువతకు సూచించారు.
ఈ కార్యక్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సబ్యులు ఉండవల్లి గాంధీ బాబు, వెంకట పద్మలత, చల్లా మధుసూధన రావు, హెల్ప్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వి. భాస్కర రావు, కమ్యునికేషన్ ఆఫీసర్ అనురాధ తో పాటు షుమారు 60 మందికి పైగా యువత, మహిళలు, విముక్తి సబ్యులు, వివిధ స్వచ్చంద సంస్థ ల ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News